‘అజ్ఞాతవాసి’ తరువాత క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని పవన్ చెబుతున్నా ఎప్పటికప్పుడు తన రీ-ఎంట్రీపై ఆసక్తికరమైన కథనాలు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే వెండితెరపై పవన్ పునరాగమనం దాదాపు ఖరారైందని టాక్. హిందీనాట విజయం సాధించిన ‘పింక్’ తెలుగులో రీమేక్ కానుందని మాతృకలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కనిపిస్తాడని వినికిడి. అంతేకాదు ఈ చిత్రానికి పవన్ ఆప్తమిత్రుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తాడని సమాచారం.
‘పింక్’ చిత్రం ఇటీవలే ‘నేర్ కొండ పార్ వై’ పేరుతో తమిళనాట రీమేక్ అయింది. అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా అక్కడా పెద్ద విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెలుగులో రీమేక్ చేసే ప్లాన్ జరుగుతోంది. అంతేకాదు తమిళ వెర్షన్ ను నిర్మించిన బోనీకపూర్‌తో పాటు ‘దిల్’ రాజు కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాడని టాక్. అలాగే ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తోంది. ఇక ఈ కోర్టు డ్రామాకి మాటలు ప్రధాన బలం కాబట్టి ఆ బాధ్యతను త్రివిక్రమ్ కి అప్పగించే దిశగా పవన్ యోచిస్తున్నాడని అంటున్నారు. పవన్ హీరోగా ఇప్పటికే మూడు చిత్రాలను రూపొందించడమే కాకుండా ‘తీన్ మార్’ చిత్రానికి డైలాగ్స్ కూడా రాశాడు త్రివిక్రమ్. అయితే, హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్‌గా రూపొందిన ‘తీన్ మార్’ ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ‘పింక్’ రీమేక్ అయినా పవన్, త్రివిక్రమ్ జోడీకి కలిసొస్తుందేమో చూడాలి.