Home ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిదే : దాసరి రాజా మాష్టారు

విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిదే : దాసరి రాజా మాష్టారు

286
0

కందుకూరు :  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్ర‌ప్ర‌భుత్వానిదేన‌ని టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, టిడిపి శిక్ష‌ణా కేంద్రం డైరెక్ట‌ర్ దాస‌రి రాజా మాస్టారు పేర్కొన్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా నష్టపోయిందన్నారు. ప్రధాన ఆర్థిక, అభివృద్ధి కేంద్రమైన హైదరాబాద్‌ను కోల్పోయామ‌న్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో కష్టాలు మరింత పెరిగాయన్నారు. అందువల్ల  విభజ నాటి హామీలను కేంద్రం అమలు చేయవలిసిన బాధ్యత కేంద్రాని దేనని అన్నారు. టిడిపి 156వ బ్యాచ్ శిక్ష‌ణ ప్రారంభం సంద‌ర్భంగా టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. అనంతరం రాజా మాష్టారు మాట్లాడుతూ  విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

భౌగోళిక ప్రదేశం ఆధారంగా ఇరు రాష్ట్రాలకు ఆస్తులు పంచితే, అప్పులు మాత్రం జనాభా ఆధారంగా పంచారని విమర్శించారు. ప్రత్యేక హోదా, వనరుల వ్యత్యాసాన్ని సరిచేయడం, కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, గ్రీన్‌ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం, అమరావతికి ఆర్థిక సాయం, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, జాతీయ సంస్థల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీట్ల పెంపు చేయాల్సివుందన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌పై కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.  కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం కేంద్ర‌మే అందించాల‌న్నారు. 9, 10 షెడ్యూల్‌ సంస్థలను విభజించాల్సి ఉందన్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, అమరావతికి ర్యాపిడ్ రైలు, రోడ్డు అనుసంధానం కావాల్సిఉందన్నారు.  అమరావతికి ఆర్థిక సహాయం, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు.

అసెంబ్లీ సీట్ల పెంపు, పన్ను విధింపు విషయాల్లో తేడాలను పరిష్కరించకుండ కేంద్రం నిర్ల‌క్ష్య‌ దోరణితో ఉండ‌టం మంచిది కాద‌న్నారు.  గ్రేహౌండ్స్ శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తలసరి ఆదాయం రూ.35వేలు తక్కువగా ఉందన్నారు. దీనని సరిచేయాల్సవుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు విభజన కష్టాలను అధిగమించాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం విభజన హామీలను అమలు చేయవలసి ఉందన్నారు. ఇప్పటికీ స్నేహ ధర్మాన్ని పాటిస్తున్న చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా యావత్తు పార్టీ యంత్రాంగం క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. శిక్షణకు గుంటూరు జిల్లా నుండి వేమూరు, తెనాలి, వినుకొండ, గురజాల,  ప్రకాశం జిల్లా నుండి కనిగిరి, మార్కాపురం, నెల్లూరు జిల్లా నుండి ఉదయగిరి నియోజక వర్గాల నుండి గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున్, శిక్షకులు పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.