– ️డిసెంబర్ 21న వైఎస్సార్ నేతన్న నేస్తం ప్రారంభం – ️ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ. 24వేలు – ఏపీ కేబినెట్ ఆమోదం.. – మత్స్యకారులకు రూ. 10వేల ఆర్థిక సాయం. – ️న్యాయవాదులకు రూ. ఐదువేల ఆర్థికసాయం. – ️హోంగార్డు జీతాల పెంపునకు ఆమోదం
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం డిసెంబర్ 21న ‘వైఎస్సార్ చేనేత నేస్తం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేయనుందని తెలిపారు. మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌కు తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకారులు డీజిల్ పోయించుకున్నప్పుడే సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతోందని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లేవారు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు.
న్యాయవాదులకు రూ. 5వేలు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయవాదులకు రూ.5వేల ప్రోత్సాహం అందించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
హోంగార్డుల జీతాలు పెంపు. రాష్ట్రంలోని హోంగార్డుల జీతాలను పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోంగార్డుల రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచింది. దీంతో హోంగార్డుల వేతనం నెలకు రూ.18వేల నుంచి రూ. 21,300కు పెరిగింది.