కొండెపి : “వైసీపీలో గెలిచి టిడిపిలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఎవ్వరినీ సస్పెండ్ చేయలేదు. అంతకంటే మించిన నేరం నేనేమి చేశాను. ఎందుకు సస్పెండ్ చేసి అవమానించారు. కొండెపి నియోజకవర్గంలో జరిగే పరిణామాలు అన్ని పార్టీ అధినేత జగన్ దృష్టి కి వెళ్లాయని అనుకోవడంలేదు. నియోజకవర్గ కార్యకర్తతో సమావేశం ఏర్పాటు చేసి నేను చేసిన తప్పేమిటో కార్యకర్తలకు వివరించి నా దీక్షను అధినేత జగన్మోహన్రెడ్డిగారే విరమిపజేయాలి. అప్పటివరకు ఇలాగే ఉంటా.” నిరవధిక దీక్షలో ఉన్న కొండెపి వైసీపీ నాయకులు వరికూటి అశోక్ బాబు పేర్కొన్నారు.
వరికుటి అశోక్ బాబుపై వేధింపులకు నిరసనగా కొండేపి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయన మంగళవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్ పార్టీ కోసం నాలుగేళ్లు కష్టపడి పనిచేశానన్నారు. తన ఆస్తులమ్మి పార్టీని బ్రతికించానని చెప్పారు. తనను ఎందుకు పార్టీ నుండి బహిష్కరించారో జగన్ చెప్పాలని కోరారు. వైయస్సార్ పార్టీతో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరితే, వారిపై ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. కానీ పార్టీ కోసం నిరంతరం కష్టపడి, కుటుంబాన్ని సైతం వదిలి నియోజకవర్గంలో గడపగడపకు తిరిగి పార్టీకి జవసత్వాలు తెచ్చిన తనపై ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.
పార్టీ అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాన్నీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలతో కలిసి విజయవంతం చేయమని చెప్పారు. పోలీసు కేసులు పెట్టించుకుని ఎన్నో ఇబ్బందులను అధిగమించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన విషయం ఇక్కడి కార్యకర్తలకు తెలుసని చెప్పారు. అలాంటి తనను పార్టీ నుండి ఎందుకు బహిష్కరించారో కార్యకర్తలకు తెలపాలని కోరారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నారు. కానీ కార్యకర్తలను జిల్లా నాయకత్వం సమావేశపరిచి, వాళ్ల మనోభావాలను తెలుసుకోవాలని కోరారు. అప్పటివరకు నిరవధిక నిరాహార దీక్ష కోనసాగుతుందని తెలిపారు.
ఏ పార్టీ లోనైనా ఆ పార్టీ ఇన్చార్జిని తొలగించేటప్పుడు ఎందుకు తొలగిస్తున్నారో నోటీసు ద్వారా లేదా కనీసం పత్రికా ప్రకటన ద్వారా అయినా తెలియపరచి తొలగిస్తారని అన్నారు. కానీ తెలుగుదేశం కోవర్ట్లు ఇద్దరు ముగ్గురి మాటలు నమ్మి పార్టీ కోసం నిరంతరం పనిచేసిన తనను పార్టీ నుంచి బహిష్కరించడం బాధ కలిగించిందన్నారు. తనను ఇంత చులకనగా చూస్తూ కారణం లేకుండా బహిష్కరించి రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారన్నారని ఆరోపించారు. తనను ఎందుకు బహిష్కరించారో జగన్ నుంచి సమాధానం వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.