ఒంగోలు : “రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సాగర్ జలాలు వాటా ప్రకారం రావడం లేదు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. గుండ్లకమ్మ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లివ్వడం లేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలన్నింటిపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోరాడాలని” వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు సూచించారు. మంగళవారం స్థానిక వైఎస్‌ఆర్ విజయ భవన్‌లో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులతోపాటు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో సుధాకర్‌బాబు మాట్లాడుతూ గురువారం నుంచి నాలుగు మండలాల్లో పర్యటిస్తానని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని చెప్పారు. సుబాబుల్, జామాయిల్‌ను ప్రభుత్వం, మిల్లర్ల మధ్య కుదిరిన ఒప్పంద ధరల ప్రకారం కర్ర కొనుగోలు చేయించేట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమావేశంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు దివి పున్నారావు, మండవ అప్పారావు, దుంపా చెంచిరెడ్డి , దాసరి లక్ష్మీ నారాయణ, చీమకుర్తి పట్టణ అధ్యక్షులు కిష్టంపాటి శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.