చీరాల : మండలంలోని వివిధ గ్రామాల్లో పొదుపు సంఘాల రుణాలు, వెలుగు, స్ర్తీనిధి రుణాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఎంపిపి గవిని శ్రీనివాసరావు కోరారు. ఎంపిడిఒ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలు పొందిన పొదుపు సంఘం నుండి రుణమొత్తాన్ని బట్టి రూ.5వేల నుండి రూ.10వేల వరకు ఐకెపి సిబ్బంది వసూలు చేశారని ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టి, స్ర్తీనిధి రుణాలలోనూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వీటిపై ఎలాంటి విచారణ లేదన్నారు. విజయనగరకాలనీ, ఈపూరుపాలెం, దేవినూతల, పిట్టువారిపాలెం, గవినివారిపాలెం, కొత్తపాలెం, తోటవారిపాలెం గ్రామాల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయని వాటి స్థానంలో కొత్తమొక్కలు నాటి, వాటికి నీళ్లుపోయాలనే పేరుతో అదనంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళల పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాలు కూడా సక్రమంగా అందడంలేదని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపుల్లో గేదెలు కొనుగోలు చేసి చనిపోయిన గేదెల కమ్మలు తీసుకుని తిరిగి డబ్బు ఇవ్వాల్సి ఉండగా తిప్పుకుంటున్నారని అన్నారు. మండల అభివృద్ది కార్యాలయం ప్రాతిపదికగా పనిచేసే అధికారుల తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.