హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి మహారాష్ట్ర కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటం సందర్భంగా నమోదైన కేసులో ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ టిడిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి నాన్‌బెయిలబుల్ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ధర్మాబాద్ కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకుపై ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎనిమిది ఏళ్ళుగా పెండింగులో ఉన్న వారెంట్ ను ఎలాంటి హెచ్చరికలు లేకుండా తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, టిడిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.