Home ఆంధ్రప్రదేశ్ కడసారి చూసేందుకు త‌ర‌లొచ్చిన అభిమానం

కడసారి చూసేందుకు త‌ర‌లొచ్చిన అభిమానం

456
0

హైదరాబాద్‌: టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ అంతిమయాత్రకు టిడిపి శ్రేణులు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున‌ తరలివచ్చారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుండి అంతిమ యాత్ర‌ ప్రారంభమైంది. హ‌రికృష్ణ మ‌హాప్ర‌స్తానయాత్రకు భారీగా అభిమానులు రావడంతో రోడ్లన్నీ జ‌నంతో రద్దీగా మారాయి. అంతిమ‌యాత్ర సాగినంత పొడ‌వునా రోడ్ల‌లో జ‌నం ర‌ద్దీగా ఉండ‌టంతోపాటు భ‌వ‌నాలు, నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాల సెంట్రింగ్‌, పిట్ట‌గోడ‌లు, మెట్ల‌పై నిల‌బ‌ది వీక్షించిన అభిమానులూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా హ‌రికృష్ణ పార్ధీవ‌దేహాన్ని వాహ‌నం వ‌ర‌కు మోసుకురావ‌డంలో ఒక‌వైపు ప‌ట్టుకుని బావ‌పై ఉన్న మ‌మ‌కారాన్ని చాటుకోవ‌డ‌మే కాదు క‌ళ్లు చెమ‌ర్చారు. ఏపీ ప్రత్యేక ప్రతిభా వంతుల కార్పొరేషన్‌ ఛైర్మన్ జి కోటేశ్వరరావు చక్రాల కుర్చీలో కూర్చుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అంతిమయాత్ర చివ‌రివ‌ర‌కు ఉన్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అంతిమయాత్ర మార్గంలో వెళ్లే వాహనదారులకు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ మ‌ళ్లించారు. మెహదీపట్నం, నానాల్ నగర్ క్రాస్‌ రోడ్, టోలిచౌక్‌, విస్పర్ వ్యాలీ టీ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకూ అంతిమ యాత్ర సాగింది. ప‌ట్ట‌ణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎవ‌రి గమ్యస్థానాలకు వారు చేరాలని ట్రాఫిక్ విభాగం సూచించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.