బాపట్ల : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. అక్రమ వ్యాపారులు రేషన్ దుకాణాల నుండి గోతాలు మార్చి ప్రయాణికుల ఆటోల్లో మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లుల్లో పాలిష్ పట్టి షాపుల్లో విక్రయాలు చేస్తున్నారు. మిల్లులతోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంత సాంకేతిక యంత్రాలను ఉపయోగిస్తుంటే అక్రమార్కులు సైతం సాంకేతికతను అదిగమించేందుకు అవసరమైన నైపుణ్యం సాధించి బియ్యం తరలిస్తున్నారు. అలాంటి అక్రమ వ్యాపారులపై సిఐ వినయ్‌కుమార్ డేగకన్ను వేశారు. అడ్డదారుల్లో తరలిస్తున్న రేషన్ బియ్యం రవాణా వాహనాలపై దాడులు చేస్తున్నారు. సమాచారం అందిన క్షణాల్లో వాలిపోతున్నారు. అలా అందిన సమాచారంతో రేషన్ బియ్యం గోతాలు మార్చి తరలిస్తున్న ఆటోను స్వాదీనం చేసుకున్నారు.