హైదరాబాద్: ఎనిమిది నెలల క్రితం లాలాపేటలో ఓ యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన మరవకముందే జరిగిన మరో దారుణం. ఈ ఘటన సర్వత్రా భయాందోళనలు కలిగిస్తుంది. సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన బిఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం చేస్తున్న హరిప్రకాశ్, రేవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగం నిమిత్తం హరిప్రకాశ్ విజయవాడలో ఉంటుండగా.. ఆయన భార్య ఇద్దరు కుమార్తెలతో అంబర్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. పెద్ద కుమార్తె అనూష(16) హిమాయత్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరô చదువుతూ ట్యూషన్ సెంటర్‌లో పరిచయమైన నారాయణగూడ సమీపంలో మరో కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న పార్శిగుట్టకు చెందిన ఆరేపల్లి వెంకట్(18)తో చనువుగా మాట్లాడుతుంది. ఆమాటలతో వెంకట్..ఆమెపై ప్రేమ పెంచుకున్నట్టు సమాచారం. అయితే నెల రోజులుగా తనతో సరిగా మాట్లాడటం లేదని, చనువుగా ఉండటం లేదని బాలికపై.. వెంకట్ అక్కసు పెంచుకున్నాడు. మాట్లాడాలంటూ మంగళవారం సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కళాశాల రైల్వేసేష్టన్ వద్ద ఉన్న పాతపడిన పోలీసు క్వార్టర్స్ వద్దకు బాలికను రప్పించాడు. ఇద్దరి మధ్యా మాటామాట పెరగడంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో బాలిక గొంతుకోశాడు.
దీంతో బాలిక అనూష భయంతో కేకలు వేసింది. కేకలు విన్న సమీప రైల్వేస్టేషన్ వద్ద ఉన్న కొందరు యువకులు అటువైపు పరుగుతీశారు. రక్తపు మడుగులో బాలిక పడి ఉండటాన్ని చూశారు. యువకులను చూసి అక్కణ్నుంచి ముద్దాయి వెంకట్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుణ్ని పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుల దాడిలో గాయపడిన ముద్దాయి వెంకట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హంతకునిపై హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కుమార్తె మరణవార్త విన్న ఆమె తల్లి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో చురుకుగా ఉండే అనూష ఎవరితో ప్రేమ వ్యవహాలు లేవని బంధువులు తెలిపారు.