చీరాల : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం చీరాల చేరుకున్నారు. కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం దూబగుంటలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ట్రిపుల్ ఐటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన మద్యాహ్నానికి చీరాల నియోజకవర్గానికి చేరుకున్నారు. తొలుత రామన్నపేట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో పందిళ్లపల్లి చేరుకున్నారు. పందిళ్లపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1.18కోట్లతో నిర్మంచనున్న ప్రాధమిక వైద్యశాలకు, రూ.54లక్షలతో నిర్మించనున్న అంగనవాడీ భవనానికి, రూ.2.70కోట్ల అంతర్గత రోడ్లు, రూ.50లక్షలతో స్మశానవాటిక అభివృద్ది, రూ.7.27లక్షలతో ఘనవ్యర్ధపదార్ధాల నియంత్రణ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
స్టేజి బజారులో చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత మగ్గం, ముడిసరుకులను పరిశీలించారు. నూతనంగా ఎంపికైన లబ్దిదారులకు ఆదరణ 2 పథకంద్వారా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేనేత పరికరాలు అందజేశారు. ఆదరణ పథకంలో ముఖ్యాంశాలైన చేనేత రుణమాఫీ, వడ్డీరాయితీ, పావలావడ్డీ, శిక్షణ, మౌళిక వసతుల కల్పన, సాధారణ చేనేత కార్మికులకు పొదుపు నిధి, మహాత్మాగాంధీ బున్‌కర్‌భీమా, సమగ్ర చేనేత అభివృద్ది పథకం, చేనేత కార్మికుల వృద్దాప్య పెన్షన్, చిలపనూలు, రంగులు రసాయనాలపై 20శాతం రాయితీ, ముద్రపథకం ద్వారా చేనేత రుణాలు వంటి అంశాలను పరిశీలించి చేనేత మగ్గాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా ఎదగాలని సూచించారు. చేనేత కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్‌టిఆర్ వైద్యసేవను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లను మంచి చదువులు చదివించుకునేందుకు ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు. నేత కార్మికుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించుకున్న నూతన గృహాలను ప్రారంభించారు. గృహనిర్మాణంలో నాణ్యత వివరాలను లబ్దిదారు రాలు యారాసు లక్ష్మి, శేఖర్‌లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి తృప్తి చెందామని లబ్దిదారులు చెప్పిన మాటలకు ఆనందం వ్యక్తం చేశారు. వేటపాలెం ప్రాధాన్యమైన జిడిపప్పు దండను మహిళలు చంద్రబాబుకు బహుకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట చేనేత, జౌళి శాఖా మాత్యులు అచ్చన్నాయుడు, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు పరిటాల సునీత, అటవీ శాఖా మాత్యులు శిద్దా రాఘవరావు, ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎంఎల్ఎ గొట్టిపాటి రవికుమార్, యర్రగొండపాలెం ఎంఎల్ఎ పాలపర్తి డేవిడ్‌రాజు, ఎంపి నిమ్మల కృష్ణప్ప, ఎంఎల్సి పోతుల సునీత, కరణం బలరామకృష్ణమూర్తి, హస్తకళల కార్పోరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు, కలెక్టర్ వి వినయ్‌చంద్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు.