చీరాల : ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు స్వతంత్ర అభ్యర్ధులు ఎవ్వరూ విజేతలుగా నిలవలేదు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిసి ఆ రికార్డును తిరగరాశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చీరాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ తప్ప మరో జెండా ఎగిరిన సందర్భంలేదు. మద్యలో పౌరసమితి పేరుతో బొనిగల అశోక్‌కుమార్‌కు ముందు కాంగ్రెస్ నేతలే ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1983లో టిడిపి తెరపైకి వచ్చినప్పటి నుండి చీరాల మున్సిపాలిటీలో పాగావేయలేకపోయింది. కానీ ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్ధిగా తన ప్యానెల్‌లో గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లను టిడిపిలో గెలిచిన 12మందికి జతచేయడంతో మొట్టమొదటి సారి చీరాల మున్సిపాలిటీపై పసుపు జెండా ఆవిష్కరించారు. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ప్రత్యర్దులతో వివాదాలను ఎదుర్కొంటూనే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. తాను జెడ్‌పిటిసిగా ఉన్న రోజుల్లోనే 2004లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని పందిళ్లపల్లి తీసుకొచ్చారు. ఆతర్వాత మారిన రాజకీయాల్లో డాక్టర్ కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిలను నియోజకవర్గానికి తీసుకొచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వేటపాలెం, పందిళ్లపల్లిలో కార్యక్రమాలు, బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్‌తో టిడిపి ఓటర్లతోపాటు చేనేతలు జతకడితే ప్రత్యర్ధులకు గెలుపు ఆసే ఉండదనే అంచనాలు వేస్తున్నారు. ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసేందుకు జనసమీకరణపై కేంద్రీకరించారు. సభ విజయవంతానికి గ్రామాలనుండి చేనేతలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. చేనేతలతోపాటు వస్ర్త వ్యాపారంపై ఆధారపడ్డ చీరాల పట్టణంలోని వస్ర్తవాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ కూడా సెలవు ప్రకటించారు. అక్కడి జనాన్నీ సభకు తరలించేందుకు సన్నాహాలు చేశారు.
రాష్ట్రంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చేనేత కేంద్రాలు ఉన్నప్పటికీ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించేందుకు మాత్రం ముఖ్యమంత్రి చీరాలనే ఎంపిక చేసుకోవడంలో రాజకీయ సమీకరణలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి చెందిన జంజనం శ్రీనివాసరావు, పోతుల సునీత ఇద్దరూ టిడిపిలో ఉండటం, వీరిద్దరినీ ఓడించిన ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలోనే ఉండటం కూడా ఇక్కడ చర్చనీయాంశం. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు సైతం టిడిపిలోనే ఉంటూ స్వతంత్రతను చాటుకునే ప్రయత్నం చేయడం, చేనేత అభ్యర్ధులు కొత్తగా తెరపైకి వస్తుండటం వంటి అంశాల నేపధ్యంలో జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటన వెనుక రాజకీయ అంశాలేంటనేదీ విశ్లేషిస్తున్నారు.
ఆమంచి పాలనలో రూపుదిద్దుకున్న చేనేత కాలనీలు
ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ సారధ్యంలో కొణిజేటి చేనేత పురి రూపుదిద్దుకుంది. గతంలో చేనేత షెడ్డుల్లోనే జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులకు 500మందికి కొణిజేటి చేనేత పురిలో నివేశన స్థలాలు ఇచ్చారు. 253ఇళ్లను వర్క్‌షెడ్ కం హౌస్ నిర్మాణం చేసి ఇచ్చారు. వీటితోపాటు చేనేతల్లో వ్యక్తిగత సమస్యలపై వచ్చేవారికి పనులు చేయడంతోపాటు చేనేత గ్రామాల్లోనూ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు మంజూరైన 16చేనేత క్లస్టర్లలో 13క్లస్టర్లు చీరాల నియోజకవర్గంలోనే అమలయ్యాయి. ప్రతిక్లస్టర్ పరిధిలో సుమారు 250మంది కార్మికుల కుటుంబాలు నేరుగా లబ్దిపొందారు. ఇలా చేనేతలను చేరువ చేసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి పర్యటన ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్‌కు కొత్తబలాన్ని ఇస్తుందని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో తనపై ఓటమి చెందిన జంజనం శ్రీనివాసరావును ఎఎంసి ఛైర్మన్‌గా నియమించడం కూడా ఆమంచికి కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.
చేనేతల్లో చిగురిస్తున్న ఆశలు
నియోజకవర్గంలో 40వేలకుపైగా చేనేత ఓటర్లు ఉన్నారు. గతంలో డాక్టర్ సజ్జ చంద్రమౌళి, ముట్టె వెంకటేశ్వర్లు, ప్రగడ కోటయ్య ఇక్కడి నుండి చేనేత అభ్యర్ధులుగానే శాసన సభకు వెళ్లారు. ఆతర్వాత చేనేత సెంటిమెంట్‌పై ఆధారపడి టికెట్లు తెచ్చుకుని 1999లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన గోలి అంజలీదేవి, 2009లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన జంజనం శ్రీనివాసరావు, 2014లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన పోతుల సునీత ఓటమి చెందారు. ఈ ముగ్గురు పోటీ చేసిన సమయంలో విజేతలుగా నిలిచిన వారిలో డాక్టర్ పాలేటి రామారావు బిసి సామాజికవర్గానికే చెందిన వ్యక్తి కాగా మిగిలిన రెండు సందర్భాల్లో ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహనే విజేతగా నిలిచారు. ఈసారి మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో చేనేతలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరే ఆశవహుల్లో మాత్రం కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎవరికి వారే స్వతంత్రతను చూపుకునేందుకు ప్రయత్నాలు చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది.