Home జాతీయం నరేంద్రమోడీ – ఇంత దుష్ప్రచారమా…..!?

నరేంద్రమోడీ – ఇంత దుష్ప్రచారమా…..!?

576
0

హైదరాబాద్ : విడదీయరాని దోస్త్‌, ప్రాణ స్నేహితుడు అనుకున్న బ్రూటస్‌ చేసిన ద్రోహానికి నివ్వెరపోయిన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూటస్‌ ( బ్రూటస్‌ నువ్వు కూడా ఇంత ద్రోహానికి పాల్పడతావా) అన్న విషయం తెలిసిందే. అధికారంతో కూడిన రాజకీయాల్లో ఎవరెప్పుడు, ఎందుకు వెన్ను పోటు పొడుస్తారో ఎవ్వరికి తెలియదు.

ప్రధాని నరేంద్రమోడీని రాజీవ్‌ గాంధీ తరహాలో హతమార్చేందుకు మావోయిస్టుల పేరుతో వున్న తీవ్రవాదులు కుట్రపన్నారనేది మహారాష్ట్ర పోలీసుల అభియోగం. ఒక వేళ నిజంగా అది నిజమే అయితే గర్హనీయమే. పోలీసులు గతంలో నక్సల్స్‌ మీద అనేక కుట్ర కేసులు బనాయించారు. దాదాపు ఏ ఒక్కటీ రుజువు కాలేదు. ఇది కూడా అలాంటిదే. అయితే పోలీసుల తీరును ఖండించాల్సిందే. మన పోలీసు, దర్యాప్తు సంస్ధలను అధికారంలో ఉన్న నేతలు దుర్వినియోగం చేయటంతో వాటి మీద విశ్వాసం అడుగంటిన సమయమిది.

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధిని షీలా రషీద్‌ ఈ మధ్య ఒక ట్వీట్‌ చేశారు. నరేంద్రమోడీ హత్యకు కుట్రపన్నారనే పోలీసుల కధనం గురించినదే అది. ‘దీన్ని చూస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా నితిన్‌ గడ్కరీ మోడీని హతమార్చేందుకు, ఆ నెపాన్ని ముస్లింలు లేదా కమ్యూనిస్టుల మీద మోపి ముస్లింలను వధించేందుకు పధకం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది‘ అన్నది దాని సారాంశం.

దీన్ని చూసి గుండెలు బాదుకోవాల్సిన అగత్యమేమీ కనిపించటం లేదు. ఆమె ట్వీట్‌ సంగతి పక్కన పెడితే అలాంటి ట్వీట్‌ చేసినందుకు పోలీసులు ఆమె మీద కేసునమోదు చేసినట్లు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసిన వారు ఆమె ట్వీట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించారు. పోలీసులు తమకు ఒక ఫిర్యాదు వచ్చిందని దాని మీద విచారణ చేస్తున్నాం తప్ప ఇంతవరకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఏదో ఒక సాకుతో ఆమె మీద కేసును కూడా నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.

కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపాన్ని చూసి బయటకు వచ్చిన వారు ఆ సంస్ధ చేసే కుట్రల గురించి బహిరంగంగానే చెప్పారు. వాటి గురించి తెలిసిన వారికి షీలాకు వచ్చిన అనుమానం ఎంతో మందికి వచ్చింది. ఎల్‌కె అద్వానీ ప్రధాని కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు కొందరు తెరవెనుక కుట్రలు నడిపారన్నది బహిరంగ రహస్యం. దానికి ముసుగుగా వయస్సును, మరొకదాన్ని ముందుకు తేవటం వేరే విషయం. ఎన్‌టి రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అండ్‌ కో చేసిన మంత్రాంగం, యంత్రాంగం కూడా తెలిసినదే. దానికే మరోపేరు కుట్ర. మతపరమైన వుగ్రవాద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న హిందూత్వ సంస్ధలు, ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా తాలిబాన్‌, ఐఎస్‌ వంటివిగానీ రాజకీయంగా కమ్యూనిస్టుల పేరుతో వుగ్రవాద చర్యలకు పాల్పడే వివిధ సంస్ధలు గానీ తమ పధకాల అమలుకు కుట్రలు చేయటం సాధారణమే. మూసిపెట్టి వుండే ప్రతి సంస్ధ నిత్యం ఏదో ఒక కుట్ర చేస్తూనే వుంటుంది.

2008లో మావోయిస్టులు లాల్‌ఘర్‌ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్యను హతమార్చేందుకు మందుపాతరలు పేల్చిన విషయం తెలిసిందే. ఎక్కడో ఒక దగ్గర కుట్ర జరగకుండా అలాంటివి జరగవు. అయితే సిపిఎం ఎన్నడూ ఆ వుదంతాన్ని చూపి సానుభూతి పొందేందుకు ప్రయత్నించలేదు. అదే మావోయిస్టులు సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీతో చేతులు కలపటం, చివరకు ఆమె చేతిలో వారెలాంటి చావు దెబ్బలు తిన్నది చరిత్రలో నమోదైంది. ప్రజలందరూ చూశారు. వారిని రాజకీయంగా ఎదుర్కొంటూనే, అధికారంలో వున్న కారణంగా శాంతిభద్రతల సమస్య వరకు యంత్రాంగాన్ని వుపయోగించి సిపిఎం పని చేసింది. ఇప్పుడు మావోయిస్టులు నరేంద్రమోడీని హతమార్చేందుకు రాజీవ్‌ గాంధీ తరహాను అమలు చేసేందుకు నిజంగా ఆలోచిస్తున్నారా లేక నరేంద్రమోడీ ప్రచార ఆయుధంగా తప్పుడు లేఖలు సృష్టించారా అన్నది తరువాత బయటపడక మానదు. అలాంటి ప్రయత్నాలు నిజంగా చేస్తే ఎవరు చేసినా అది గర్హనీయమే. ఒక దుష్ట భూస్వామిని అంతం చేసినంత మాత్రాన ఆ వ్యవస్ధ అంతరించలేదు. అంతకంటే పేరు మోసిన వారు కొన్ని డజన్ల మంది వచ్చారు, వస్తారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది.

చరిత్రలో జరిగిన అనేక వుదంతాలను చూసినపుడు ఏమి జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్య జరిగి ఐదు దశాబ్దాలు కావస్తున్నది. అనేక రహస్యాలను ఛేదించిన ఎఫ్‌బిఐ, సిఐఏ ఈ విషయంలో హత్యవెనుకు ఎవరున్నారు, దేనికి చేశారు అన్నది ఇంతవరకు కనిపెట్టలేకపోయాయి. హత్య చేసేందుకు ఏదో ఒక సమయంలో ప్రయత్నించిన బృందాలు 42 వున్నాయని, 82 మంది హంతకులు, 214 మంది ఇతరులు వున్నారని చెప్పటం తప్ప జరిగిందేమిటో తెలియదు. ఇందిరా గాంధీ హత్య వెనుక వున్న కుట్ర, ఇతర విషయాల గురించి బయటకు చెప్పరాదని ఏకంగా ఒక నిర్ణయమే చేశారు. ఇలా చరిత్రలో ఎన్నో వున్నాయి. తాము పెంచి పోషించిన వుగ్రవాదం లేదా మతోన్మాదం చేతిలో తామే బలైపోయిన వుదంతాలు ఎన్నో వున్నాయి.

ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు నాటి మిలిటరీ అధిపతి సుహార్తో తన సహచరులను కొందరిని చంపించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై మోపి లక్షల మందిని వూచకోత కోయించాడు. పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్ధి అకాలీదళ్‌ను ఎదుర్కొనేందుకు ఇందిరా గాంధీ వుగ్రవాది భింద్రన్‌వాలేను పెంచి పోషించిన చరిత్ర తెలుసు. చివరకు వాడిని హతమార్చినందుకు ప్రతీకారంగా భద్రతా సిబ్బంది రూపంలో వున్న మరొక వుగ్రవాది చేతిలో ఇందిరాగాంధీ హతమైన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీలంక తమిళ తీవ్రవాదులకు మద్దతు, శిక్షణ కూడా ఇచ్చేందుకు మన దేశం ఏర్పాట్లు చేసిన విషయం బహిరంగ రహస్యం. చివరకు అలాంటి వారిని అదుపు చేసేందుకు మన దేశమే శాంతి నెలకొల్పే పేర సైన్యాన్ని పంపి తీవ్రవాదులను అణచేందుకు ప్రయత్నించింది. దాని పర్యవసానమే రాజీవ్‌ గాంధీ అదే తీవ్రవాదుల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే.

వుగ్రవాదం అనేక రూపాలలో వుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా వుండదు. కొత్తది పుట్టుకు వస్తుంది. తాలిబాన్లే ఒక కొత్త పరిణామం అయితే, ఐఎస్‌ గురించి ఎవరైనా వూహించారా? దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా రెచ్చగొట్టిన పర్యవసానాలను తక్కువ అంచనా వేయకూడదు.

వాగ్దానం చేసినట్లుగా అయోధ్యలో రామాలయం కట్టనందుకు హిందూత్వశక్తులు వుగ్రవాదులుగా మారవచ్చు. విశ్వహిందూపరిషత్‌ నుంచి బయటకు వెళ్లగొట్టిన ప్రవీణ్‌ తొగాడియా స్వంత దుకాణం తెరవబోతున్నాడు. తనను హతమార్చటానికి కుట్ర జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ కుట్ర ముస్లింలు చేశారని ఆయన చెప్పలేదు. అంటే ఆయన పనిచేసిన సంస్ధలు, పార్టీలకు చెందిన వారే అందుకు ప్రయత్నించారని అనుకోవాలి. అనేక సంస్ధలు రామాలయం మీద బిజెపి మాట తప్పిందనే విమర్శలు ప్రారంభించాయి.

వున్మాదాన్ని పెంచి పోషించిన తరువాత దానికి తన మన అనే విచక్షణ వుండదు. అందువలన అలాంటి ధోరణులను ప్రోత్సహించిన వారు, పరమత ద్వేషాలను రెచ్చగొడుతున్నవారికి ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వుంటుందో చెప్పలేము. వుగ్రవాదులు అన్న తరువాత అది మత పరమైనదైనా మరొకటైనా నిత్యం చేసేది అదే.

నరేంద్రమోడీ పట్ల విమర్శనాత్మకంగా వున్నవారిని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే జర్నలిస్టులు, రచయితలు, మేథావులను అనేక మందిని హతమార్చిన వారు, ఇప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నది హిందూత్వ శక్తులు అన్నది అందరికీ తెలిసిన రహస్యం. షీలా రషీద్‌ ట్వీట్‌ గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గౌరీ లంకేష్‌కు సక్సల్స్‌తో సంబంధాలున్నాయని వారే ఆమెను హత్య చేశారని ప్రచారం చేసిన విషయాన్ని జనం ఇంకా మరచి పోలేదు. కొంత మంది నక్సల్స్‌ను ప్రభుత్వానికి లొంగిపోయేట్లు గౌరీ చేశారని, అది గిట్టని నక్సల్స్‌ ఆమెను హత్య చేశారని ప్రచారం జరిగిందా? లేదా? చివరికి దొరికిన నిందితుడు హిందూత్వ సంస్ధల ప్రమేయం వుందని పోలీసుల ముందు అంగీకరించినట్లు తాజా వార్తలు చూస్తున్నాం. అందువలన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరు, ఎంతటి దారుణాలకు పాల్పడతారో తెలియదు. లేదూ హిందూత్వశక్తులు ప్రచారం చేసినట్లుగా నక్సల్సే గౌరీ లంకేష్‌ను హతమార్చారు అనుకుంటే అదే పని మోడీనో మరొకరినో హతమార్చటానికి ఆయన పార్టీలోనే కొందరు కుట్ర చేయవచ్చని ఎవరికైనా అనిపిస్తే ఆశ్చర్యం ఏముంది? గుజరాత్‌ బిజెపి నేత, మాజీ హోంమంత్రి అయిన హరేన్‌ పాండ్య హత్య వెనుక వున్న కుట్ర ఏమిటో ఇప్పటికీ బయటకు రాలేదు. స్వంత పార్టీ నేతలవైపే అనేక కళ్లు చూసిన మాట నిజం కాదా?

రాజకీయ ప్రత్యర్ధుల గురించి, ఇబ్బందులు వచ్చినపుడల్లా గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విదేశీ హస్తం గురించి ఎక్కువగా చెబుతుండేవారు. చివరికి ధరల పెరుగుదల వెనుక కూడా విదేశీ హస్తం వుందనేంత వరకు పోయారని ఎన్నో జోకులు పేలాయి అప్పుడు. ఇప్పుడు స్వయంగా నరేంద్రమోడీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తన హత్యకు కుట్ర గురించి చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే ప్రచారాన్ని మొదలెట్టారని జనం అనుకుంటున్నారు. అందుకు ఆస్కారం ఇచ్చింది ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు బిజెపి నేతలు సమాధానం చెప్పగలరా? చూద్దాం…!