Home జాతీయం మోడీకి తెలుగోడి చేతిలో మూడిందే… చంద్రబాబు సంచలనం

మోడీకి తెలుగోడి చేతిలో మూడిందే… చంద్రబాబు సంచలనం

422
0

విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక శత్రువును చంద్రబాబు ప్రకటించారు. ఆ శత్రువు పనిపట్టేలా యుద్ధం చేయడమే తమ ముందున్న కర్తవ్యం అన్నారు. ఆ యుద్దానికి కూడా సమర శంఖం పూరించారు. మహానాడు ముగింపు వేడుకలో చంద్రబాబు తాను చేయబోయే యుద్దానికి దిసానిర్దేశం చేశారు. ‘‘దేశంలో జాతీయ పార్టీలకు కాలం చెల్లినట్లే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చచ్చిపోయింది. 2019లో బీజేపీ అధికారంలోకి రాదు. మోదీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశమే లేదు. ఇక… ప్రాంతీయ పార్టీలదే రాజ్యం’’ అని టిడిపి సారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. దీనిని సాధించేందుకు 70లక్షల మంది పసుపు సైనికులు పోరాట బరిలోకి దిగాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పేది మనమేనని కార్యకర్తలను ఉత్తేజపర్చారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా టిడిపికి ఉందని చెప్పారు. మోడీ-అమిత్‌షా ధ్వయంపైనా.. వారి పిల్ల పార్థనర్ వైసీపీపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాటలెక్కువ… చేతలు తక్కువ అన్నట్లుగా మోడీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో రాజకీయ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

‘‘దేశాన్ని పదేళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పై కోపం… అచ్చేదిన్‌ అనే మోడీ మాటలు నమ్మి ప్రజలు నాలుగేళ్ల క్రితం బీజేపీకి ఓట్లేశారు. విభజన తర్వాత నవ్యాంధ్రను ఆదుకుంటారని ఎన్నికల పొత్తు పెట్టుకుంటే… మిత్రధర్మాన్ని పాటించకుండా వంచించారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి సత్తాం చాటాం. కేవలం కేంద్రం సహకారం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. అన్యాయంపై ఎదురు తిరిగినందుకు వైసీపీ, జనసేనను అడ్డుపెట్టుకొన్ని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ నేతల ఆటలు ఇక్కడ సాగవు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కేసుల భయంతో ఒకపార్టీ, తోలుబొమ్మలా ఆడే మరోపార్టీని చూసి ఏపీకి ఏదీ ఇవ్వకున్నా పర్వాలేదనే ధోరణితో మోడీ ఉన్నారని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బంది పడుతుండగా… ‘యాభై రోజులు సమయం ఇవ్వండి.. మేలు జరగకపోతే నన్ను శిక్షించండి’ అని మోడీ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు 500 రోజులైనా ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదన్నారు. వారికి ఏ శిక్ష వేయాలో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై మోదీకి కోపం, ద్వేషం ఉన్నాయని… వెనుక బడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడమే దీనికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన మోడీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

గాలి జనార్దనరెడ్డి లాంటి వారితో కర్ణాటకలో ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలుకు ప్రయత్నించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడులో వారి ఆటలు సాగలేదని… ఏపీలో అసలే సాగవని చెప్పారు. గాలి, జగన్‌లతో కలిసి కుట్రలు చేస్తూ నీతికబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక నేరస్తుల ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచితే అప్పుడు విశ్వాసం కలుగుతుందన్నారు. ఏపీలో అగ్రిగోల్డ్‌ బాధితులను బాధ్యుల ఆస్తులు జప్తుచేసి న్యాయం చేస్తున్నామని, అలాగే జగన్‌ నుంచి జప్తు చేసిన రూ.43వేల కోట్లు ప్రజలకు ఇస్తే పేద, మధ్యతరగతికి మేలు జరుగుతుందని కేంద్రానికి సూచించారు.

‘‘సామాన్య కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయికి చేరడానికి తనకు క్రమశిక్షణ, వ్యసనాలు లేకపోవడమే కారణం. అలాంటిది రాష్ట్రాన్ని దోచుకుని ప్రతి శుక్రవారం కోర్టుబోనులో నిలుచునే దొంగలు నడిరోడ్డులో ఉరితీయాలని, బంగాళాఖాతంలో పడేయాలని అంటోంటే బాధ అనిపిస్తుంది. నన్ను ఎందుకు ఉరి తీయాలి? యాభై లక్షల మందికి పెద్దకుమారుడిలా పెన్షన్లు ఇస్తున్నందుకా? కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని 54శాతం పూర్తి చేసినందుకా?’’ అని చంద్రబాబు సూటిగా నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రాణం పెట్టే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఓ దిశకు తీసుకొచ్చామని… ఇప్పుడు ఏదైనా జరిగితే రాష్ట్రం ఎన్నటికీ కోలుకోలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.