ఒంగోలు : పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ పొంది శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. సభలో అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. ఆంద్రప్రదేశ్ లో పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉందని అన్నారు. పరిశ్రమలకు రక్షణ ఉంటేనే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారను అన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖను బలోపేతం చేయడానికి 6 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు. కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా పోలీసుశాఖ సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తీసుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల పట్ల స్నేహభవాతో ఉండాలని కోరారు. .రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పోలీస్ సిబ్బంది సహకరించాలని చెప్పారు.
సభలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుందని అన్నారు. ఎంతో కష్టపడి పోలీస్ శాఖలో ఎంపికై 9నెలలపాటు శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ ను అభినందించారు. ప్రజాసమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారితో సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య యేసు బాబు, అదనపు ఎస్పీ ఉదయ రాణి, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.