ఒంగోలు : ప్రభుత్వ పాఠశాలలంటే చులక భావం అవసరంలేదు. అక్కడున్నవారంతా పేదింటి బిడ్డలే. వాళ్లకు స్టడీ అవర్లు లేవు. బస్సు సౌకర్యం లేదు. కాలినడకన వెళ్లి చదువుకున్నవాళ్లే. ఆస్థికి, సౌకర్యాలకు పేదలైతే కావచ్చు. కానీ ఫలితాల్లో ధనవంతులని నిరూపించుకున్నారు. పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రవేటు, కార్పోరేట్ పాఠశాలల విద్యార్ధులకు ధీటైన ఫలితాలు సాధించి పరిపూర్ణ విద్యార్ధులని నిరూపించారు. అందుకు ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధుల ఫలితాలే నిదర్శనం.
ఒంగోలు నగర పాలక సంస్థ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను నగర పాలక సంస్థ కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అభినందించారు. విద్యార్ధులతో కలిసి విజయ సంకేతం చూపించారు. చీరాల మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల ఫలితాలను వివరించారు. ఈపూరుపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో 38కి 37మంది, తెలుగు మీడియంలో 44కు 36మంది విద్యార్దులు ఉత్తీర్ణులైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి తెలిపారు. బోస్‌నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాలలో 51మంది విద్యార్ధులకు 49మంది ఉత్తీర్ణులైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎన్‌వి రమణ తెలిపారు. కెజిఎం బాలికోన్నత పాఠశాల (చీరాలపట్టణం)లో 140మంది విద్యార్ధులకు 125మంది ఉత్తీర్ణులైనట్లు ప్రధానోపాధ్యాయులు పివి బాబు తెలిపారు. 25మంది 9.0పైగా జిపిఎ సాధించినట్లు తెలిపారు. ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాలలో 71మందికి 66మంది ఉత్తీర్ణులు కాగా వీరిలో 13మంది 9.0పైగా జిపిఎ సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. పేరాల ఎఆర్ఎం ఉన్నత పాఠశాలలో 46మంది విద్యార్ధులకు 41మంది ఉత్తీర్ణులైనట్లు ప్రధానోపాధ్యాయులు జిసిహెచ్ ఖాదరయ్య తెలిపారు.