చీరాల : పదోతరగతి ఫలితాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రకాశం జిల్లా చీరాల విజ్ఞాన భారతి హైస్కూల్ విద్యార్ధులు ఫలితాల్లో సత్తా చాటారు. ప్రతిఏటా ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్న విజ్ఞాన భారతి హైస్కూల్ విద్యార్ధులు ఇప్పుడు పదోతరగతి ఫలితాల్లోనూ కార్పోరేట్‌కు ధీటైన ఫలితాలు సాధించి దూరపు కొండలు నునుపేన్న సామెతను రుజువు చేసి చూపించారు. పాఠశాల నుండి మొత్తం 140మంది విద్యార్ధులు పదోతరగతి పరీక్షలు రాశారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరు అంటే మొత్తం 33మంది విద్యార్ధులు 10కి 10జిపిఎ సాధించి బోధనా స్థాయిని నిరూపించారు.
ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మేజర్ తోట రోశయ్య మాట్లాడారు. పరీక్ష ఫలితాలు సాధించడంలో తమ విద్యార్ధులు ఎప్పటిలాగానే ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. 9.0పైగా 101మంది విద్యార్ధులు జిపిఎ సాధించినట్లు తెలిపారు. ఇతర విద్యార్ధులూ ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. నూరుశాతం ఉత్తీర్ణత శాతం సాధించారన్నారు. ఇతటి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను నిలిపిన విద్యార్ధులను, బోధనా సామర్ధ్యాన్ని నిరూపించిన అద్యాపకులను, విద్యార్ధుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సమావేశంలో విజ్ఞాన భారతి విద్యాసంస్థల అధ్యక్షులు జంపాల గంగాధరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.