Home జాతీయం నీతి అయోగ్ సంచలన ప్రకటన

నీతి అయోగ్ సంచలన ప్రకటన

623
0

ఢిల్లీ : దేశంలో మానవ వనరుల అంభివృద్ది, సామాజిక అంశాల్లో దేశ ప్రగతిపై నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులు దేశాభివృద్ధిని వెనక్కి లాగుతున్నాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నాయని ఆయన ప్రశంసలు కురిపించారు. అయితే తూర్పు రాష్ట్రాల్లోని సూచీల కారణంగానే దేశం అభివృద్ధిలో వెనుక బడుతోందన్నారు. ప్రత్యేకించి బీహార్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నెలకొన్న సామాజిక పరిస్థితులు అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయని పేర్కొన్నారు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంత్  ప్రసంగిస్తూ…

‘‘తూర్పు భారత ప్రాంతంలో.. ముఖ్యంగా బీహార్, యూపీ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ సామాజిక సూచీలు బాగా వెనకబడ్డాయి…’’ అని నీతీ ఆయోగ్ సీఈవో  పేర్కొన్నారు. కాగా దేశం వెనుకబాటుకు కారణమైన రాష్ట్రాలన్నీ బీజేపీ, దాని మిత్రపక్షాలు పరిపాలిస్తున్నవే కావడం గమనార్హం. సులభతర వాణిజ్యం విషయంలో మన దేశంలో ప్రగతి కనిపిస్తున్నప్పటికీ.. మానవ అభివృద్ధి సూచీ మాత్రం వెనకబడే ఉందని కాంత్ వెల్లడించారు. మానవ అభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) జాబితాలోని 188 దేశాల్లో భారత్ ఇప్పటికీ 131 స్థానంలో కొనసాగుతోందని పేర్కొన్నారు.

మరోవైపు ‘భారత పరివర్తన సవాళ్ల’పై స్పందిస్తూ.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు బాగా పనిచేస్తున్నాయనీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసలు కురిపించారు. స్థిరమైన అభివృద్ధి అత్యంత కీలకమని నొక్కిచెప్పారు. ‘‘విద్య, ఆరోగ్య రంగాలు చాలా కీలకమైనవి. అయితే ఇదే అంశాల్లో దేశం వెనుకబడి ఉంది. మన అభ్యాస ఫలితాలు దారుణంగా ఉన్నాయి. 5వ తరగతి విద్యార్ధి 2 తరగతిలోని తీసివేతలు చేయలేకపోతున్నాడు. 5వ తరగతి చదివే విద్యార్ధులు తమ మాతృభాషను చదవలేక పోతున్నారు. శిశు మరణాల రేటు కూడా అత్యధికంగా ఉంది. ఈ అంశాల్లో మనం అభివద్ధి సాధించకపోతే… స్థిరమైన అభివృద్ధి సాధించడం చాలా కష్టం..’’ అని కాంత్ స్పష్టం చేశారు. నిర్ణయాధికారంలో మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించాలన్నారు.