Home ఆంధ్రప్రదేశ్ దీక్షా.. పుట్టిన రోజు వేడుకలా : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి 

దీక్షా.. పుట్టిన రోజు వేడుకలా : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి 

415
0

ఒంగోలు : ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు చేసింది దీక్షలా లేక పుట్టిన రోజు వేడుకలా అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం వైసిపి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి విద్యార్థులు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించడం బహుశా జపాన్‌ తరహా దీక్ష అయివుంటుందని బత్తుల వ్యాఖ్యానించారు. విపక్షాలను ఢిల్లీలో ఆందోళన చెయ్యాలని సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇక్కడ ఎలా దీక్ష చేశారని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు ఆందోళన చేస్తే రాష్ట్రానికి నష్టమ‌ని చెప్పిన బాబు దీక్ష‌ చేస్తే నష్టం కాదా? లాభమా అంటూ దుయ్యబట్టారు. మొదట ప్యాకేజీకి అంగీకరించి హోదా కన్నా ఎక్కువే నిధులు వచ్చాయని బాబు చెప్పిన మాట‌లు గుర్తు చేశారు. హోదా అంటే జైలుకే అంటూ విద్యార్థులను బెదిరించి విపక్షాలపై కేసులు పెట్టించిన చంద్రబాబుకు అసలు ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.

ఒకవైపు రాష్ట్రంలో కరవుతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిన్నటిదాకా బీజేపీతో అంటకాగి ఇప్పుడు లాలూచీ ఉద్యమాలు చేస్తే ప్రజలు విశ్వసించరని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి గ‌త‌ నాలుగేళ్ల నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఎన్ని ఇబ్బందులకు గురిచేసింది ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. నేడు రాష్ట్ర ప్రజలంతా జగన్‌ మోహన్‌రెడ్డి వెనుక ర్యాలీ అవుతుంటే తట్టుకోలేకనే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాటకాలు అడుతున్నట్లు ఆరోపించారు. నిన్నటిదాకా టీడీపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లోకేష్‌పై చేసిన అవినీతి ఆరోపణలకు ముందుగా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నా ఆయనలో మార్పు రాకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పులకు ప్రజల ముందు బహిరంగ క్షమాపణలు చెప్పి తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని హితవు పలికారు.