ఢిల్లీ : ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్షం సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎల్పీ లీడర్‌గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమె గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే.
చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రాగా.. ముఖ్యమంత్రి పదవి కోసం కీలక నేతలు పోటీపడ్డారు. పర్వేష్ వర్మ సైతం ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. అలాగే, జితేంద్ర మహాజన్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. ఇక చివరకు సామాజిక సమీకరణలు, ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజిక వర్గానికి చెందిన రేఖ గుప్తా వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంగా ప్రవేశ్ వర్మ, విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం.
రేఖాగుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం గెలుపొందారు. ఆమె గతంలో ఢిల్లీ మేయర్‌గా పోటీ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ఢిల్లీ పీఠంపురా కౌన్సిలర్.. ఆ తర్వాత మేయర్‌గా పని చేశారు. రేఖాగుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన అనుభవం లేకపోయినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి.. సీఎం స్థాయి వరకు ఎదిగారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకుగ్గా వ్యవహరించారు. పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బీ కార్పొరేటర్‌గా పని చేశారు. షాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బందనకుమారిని 29వేల ఓట్లకుపైగా తేడాతో ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఆమె 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. రేఖ కుటుంబం 1976లో ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య ఢిల్లీలోనే పూర్తి చేశారు. బాల్యంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో.. ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో గెలుపొందారు.
1995–96లో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రేఖగుప్తా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 2003-04లో ఆమె బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2006 వరకు బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2007 ఉత్తర పితంపుర కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2009 వరకు డీఎంసీలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఇక 2009లో ఢిల్లీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2010లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం పోటీ చేసి ఓడిపోయారు.