చీరాల : పట్టణంలోని ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవని భానుచంద్ర మూర్తి, ఈపూరుపాలెం బాలికోన్నత పాఠశాల ఇంగ్లీషు ఉపాధ్యాయురాలు గోనెళ్ల శేషవరలక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పురస్కార సభ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలో పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల ప్రదానోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెరిట్, సర్టిఫికెట్, మెడల్, జ్ఞాపిక, రూ.20వేల నగదు బహుమతి అందజేశారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, బంధువులు అభినందించారు.