కమ్యునిస్టులపై నిందలు కొత్తేమీ కాదు… వేసేవాళ్లే కొత్తవాళ్లు….

    350
    0

    కమ్యునిస్టులు అమ్ముడు పోయారు. తొత్తులుగా మామారు. కులాభిమానం చూపారు. ఇలా కమ్యునిస్టులపై నిదలు వేయడం కొత్తేమీ కాదు. కానీ నిందలు వేసేవాళ్లే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు కొత్తగా పుట్టుకొస్తున్నారు. తాజాగా వైసిపి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలతో కమ్యునిస్టుల నిజాయితీ, రాజకీయ వైఖరి మరోసారి చర్చకు వచ్చింది. ఆయన అక్కసు, ఆరోపణలు నిజంగా కమ్యునిస్టులు అమ్మడు పోయారనా? లేక వైఎస్‌ఆర్‌సిపి రాజకీయంగా వంటరైపోతూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయాలనా? అనేదే చర్చనీయాంశం. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజలపై వాటి ప్రభావం పరిశీలిస్తే కమ్యునిస్టుల వైఖరేమిటో అర్ధమవుతుంది.

    కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. కేంధ్రప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ నోరెత్తలేదు. పైగా వైసిపి, టిడిపి రెండు పార్టీలు బిజెపిని అనుసరిస్తూ వచ్చాయి. రాష్ట్రానికి, దేశ ప్రజలకు ద్రోహం చేశాయి. అయినప్పటికీ మాట్లాడకూడదనేదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణల్లో దాగున్న అర్ధంలా కనిపిస్తుంది.

    విద్యుత్‌ సంస్కరణలు ప్రజలకు భారం కానున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే బిల్లులు తడిసి మోపెడవుతాయి. అయినప్పటికీ వైసిపి ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలనే అమలు చేస్తుంది. ఫలితంగా వైసిప అధికారానికి రాకముందు రూ.300వచ్చే విద్యుత్‌ బిల్లు ఇప్పుడు రూ.700దాటింది. దీనినెవ్వరు ప్రశ్నించాలి. ఎక్కడ ప్రశ్నించాలి.

    దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వైసిపి అధికారానికి వచ్చే వరకు ప్రాధమిక విద్య ఒక్కటే కార్పొరేట్‌ కాలేదు. పేదలకు అందుబాటులో ఉంది. అనేక గ్రామాలు, దళిత, గిరిజన కాలనీల్లో ప్రాధమిక పాఠశాలలు వచ్చాయి. ఫలితంగా పేదల పిల్లలు ప్రాధమిక పాఠశాలకు వెళ్లగలుగుతున్నారు. ఇప్పటికీ అనేక ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. ఉపాధ్యాయులను నియమించి బలోపేతం చేయాల్సిన ప్రాధమిక పాఠశాలలను కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం పేరుతో 3వ తరగతి నుండి హైస్కూళ్లలో విలీనం చేశారు. ఒకటి, రెండు తరగతులను అంగనవాడీ కేంద్రాలలో కలిపేశారు. అంగనవాడీ టీచర్‌ ప్రాధమిక విద్యార్హత పదోతరగతి. ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు టిటిసి, డిఎడ్‌ చేసినవాళ్లు ఉండేవాళ్లు. వైసిపి తీసుకున్న పాఠశాలల విలీనం పుణ్యాన దళిత, గిరిజన కాలనీల్లో ఉన్న పాఠశాలలు కనుమరుగయ్యాయి. మళ్లీ వెనుకటి రోజులు వచ్చాయి. చిన్నవయసులో పిల్లలు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసిపి అధికారానికి రాకముందు 46లక్షల మంది విద్యార్ధులు ప్రాధమిక పాఠశాలలో ఉన్నారు. ఇప్పుడు 30లక్షలకు ఆసంఖ్య పడిపోయినట్లు విద్యాశాఖ లెక్కలు చూపుతుంది. అంటే 16లక్షల మంది పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు. అంటే ఈ ప్రభుత్వ నిర్ణయం ఎవరికోసం? అమ్మ ఒడి పేరుతో ఒక బిడ్డకు రూ.13వేలు ఇచ్చి ఇంటి పక్కనున్న బడి మూసేసినా మాట్లాడకుండా చేశారు. కానీ ఇద్దరు బిడ్డలను ఇప్పడు బడికి పంపాలంటే నెలకు రూ.1500వరకు రవాణా ఖర్చులు అవుతున్నాయి. అంటే మీరిచ్చిన ఉచిత పదకం ఫలితం శాశ్విత శాపంగా మారిందనేది ఎంత మంది పేదలు గుర్తించగలరు?

    కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు లేవు. ఆఖరికి బేలుదారీ పనులు చేసుకునేవాళ్లు కూడా పొరుగునున్న హైదరాబాద్‌, బెంగుళూరు, పూణె, చెన్నై వంటి నగరాలకు వలసలు వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఆ తర్వాత అడుగుతూనే ఉంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉద్యోగులను ఆకర్షించేందుకు అధికారానికి వచ్చిన వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామన్నారు. అధికారానికి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దులో ఉన్న సాంకేతిక సమస్యలు తెలియక హామీ ఇచ్చాము. ఇప్పుడు జిపిఎస్‌ అమలు చేస్తామంటున్నారు.

    పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఐపిఎస్‌ స్థాయి నుండి హోంగార్డు వరకు రాజకీయ సిఫార్సు లేకుండా పోస్టింగు ఇచ్చే పరిస్థితి లేదనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు ప్రజాస్వామ్య పద్దతికి విరుద్దంగా చేశారు. అవినీతి చేసి ఉంటే విచారణ చేసి ఆధారాలు చూపవచ్చు. లేదా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయవచ్చు. కానీ అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు అప్రజాస్వామికమని సిపిఎం తన వైఖరిని ప్రకటించడంతో వైసిపి ప్రభుత్వ అధికార ప్రతినిధికి ఆగ్రహం తెప్పించినట్లుంది. వెంటనే కమ్యునిస్టులు అమ్మడు పోయారనే తప్పుడు ఆరోపణలు చేశారు.

    ఒక్కసారి ఇదే వైసిపి పెద్దలు వెనక్కితిరిగి ఆలోచించుకోవాల్సిన అంశాలను గుర్తు చేసుకోండి. 2004కు ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎంత నియంత్రుత్వ పోకడకలు పోయారు. విద్యుత్‌ చార్జీల పెంపు, ఆర్ధిక సంస్కరణలు అమలు చేశారు. వాటికి వ్యతిరేకంగా కమ్యునిస్టులు ఎంతటి పోరాటం చేశారు? 2004ఎన్నికల్లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కమ్యనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు కదా? అప్పట్లో కమ్యునిస్టులను ఎంతకు కొన్నారు? ఆ తర్వాత యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2010లో ఆర్ధిక నేరాల ఆరోపణలతో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టినప్పుడు, ఆతర్వాత ఇదే జగన్మోహన్‌రెడ్డి డిల్లీ వెళ్లి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాష్‌కరత్‌లను కలిసి మద్దతు కోరలేదా? అప్పుడు ఎంత పెట్టి కొనుగోలు చేసి మద్దతు అడిగారు. మీకు నచ్చినట్లు మాట్లాడితే కమ్యునిస్టులు నిజాయితీపరులు, మీ తప్పులను ప్రశ్నిస్తే అమ్ముడు పోతారా?

    కమ్యునిస్టులపై నిందారోపణలు చేసిన నేతలు ఎందో చరిత్రలో కలిసిపోయారు. వాళ్లెవ్వరూ కనిపించడంలేదు. కానీ కమ్యనిస్టులు నిత్యం జనంతోనే ఉన్నారు. ప్రజాసమస్యలే అజెండాగా పనిచేస్తున్నారు. కమ్యునిస్టులపై తప్పుడు ఆరోపణలు చేసిన నేతలు, పార్టీలు చరిత్రలో కలిసిపోయాయేతప్ప సజావుగా ఏవీలేవు. అధికారంలో ఉన్న వైసిపి చేసే తప్పుడు నిర్ణయాలతో ప్రజల్లో పులచనై కమ్యునిస్టులను నించిందించనంత మాత్రాన మీరు చేసే మోసాన్ని ప్రజలు మర్చిపోతారనుకోవడం బ్రమే అవుతుంది. ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తే అది వైసిపి అయినా, టిడిపి అయినా, బిజెపి అయినా కమ్యునిస్టులు ప్రశ్నించడం మానుకోరనేది గుర్తెరగాలి. కమ్యునిస్టుల వైఖరిని కొనుగోలు చేయడం ఎవ్వడికీ సాధ్యం కాదనేది గుర్తెరిగి మాట్లాడితే మంచిది.