Home ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రానికి వివక్ష తగదు : దాసరి రాజా మాష్టారు

రాష్ట్రం పట్ల కేంద్రానికి వివక్ష తగదు : దాసరి రాజా మాష్టారు

415
0

కందుకూరు : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత వివక్ష తగదని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ప్రతిస్పందించాలని టిడిపి  రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శిక్షణ శిభిరం డైరెక్టర్ దాసరి రాజా మాష్టారు పేర్కొన్నారు. కందుకూరులోని తెలుగు విజయం ప్రాంగణంలో జరుగుతున్న 158 బాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరనికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ఆస్తుల అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్ళు, తిరిగి చెల్లింపుల్లో మన రాష్ట్రానికి మిక్కిలి నష్టం జరిగిందన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి, ఉక్కు కర్మాగారం స్థాపించాలి, ఓడరేవు రావాలి, పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకావాలి, నియోజకవర్గాల సంఖ్య పెరగాలి, అనేక విద్యా, పరిశోధన సంస్థలు ప్రారంభించాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తికావాలని రాజా మాష్టారు గుర్తు చేసారు.  విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధానమంత్రి ఆరు హామీలతో కూడిన ప్రకటన చేసారని చెప్పారు.  అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్న రాష్ట్రానికి రెవెన్యూ లోటును భర్తీ చేయడం, బుందేల్‌ఖండ్, కోరాపుట్-బోలాంగిర్- కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడం వంటివి ఉన్ననాయని రాజా మాష్టారు అన్నారు. రైల్వేజోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడ రేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వయబిలిటీ గేప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు.

విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై యేళ్ళకైనా పూర్తవుతాయా అన్న సందేహం కలుగుతుందని రాజా మాష్టారు అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ అందజేసారు. ఈ శిక్షణకు గుంటూరు జిల్లా నుండి వేమూరు, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా నుండి కొండపి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లా నుండి సూళ్ళురుపేట, సర్వేపల్లి నియోజక వర్గాల నుండి గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో కందుకూరు జెడ్పీటిసి సభ్యులు శ్రీకాంత్, శిక్షణ శిభిరం సిబ్బంది కాకర్ల  మల్లికార్జున్, పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వరరెడ్డి చిట్టెం పాల్గొన్నారు.