మార్కాపురం : ” ఏళ్ల తరబడి గ్రామంలో ఉంటున్నా. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. సొంతిల్లు లేదు. కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనన్నా కాస్త పట్టించుకోండి సార్.” అంటూ రాయవరం గ్రామానికి చెందిన మహిళలు మందల యల్లమ్మ, వెంకట లక్ష్మి, బీబీ తమ గోడును ఒంగోలు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎదుట వెళ్లబోసుకున్నారు. తొమ్మిదో రోజు గురువారం మార్కాపురం మండలం రాయవరం నుంచి ఆయన ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. గానుగపెంట, పోతలపాడు మీదగా గజ్జలకొండ వరకు మొత్తం 16 కిలోమీటర్లు కొనసాగింది. తొలుత రాయవరానికి చెందిన నిరుపేద మహిళలు తమను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారానికి రాగానే గుర్తుంచుకొని మరీ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు.
మార్గమధ్యలో పలక గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాళ్లకు మెరుగైనే వేతనాలు, వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. గానుగపెంటలో పలువురు ముస్లిం సోదరులు కలిసి మసీదు నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు. గొర్రెల కాపరులు సుబ్బారెడ్డికి గొర్రెపిల్ల నిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, బాపట్ల పార్లమెంటు ఇన్‌చార్జి మోపిదేవి వెంకటరమణతోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉడుముల లక్ష్మీనారాయణ రెడ్డి సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, నాయకులు వెన్నా హనుమారెడ్డి, కుందురు నగార్జునరెడ్డి, బట్టపూరి వెంకట సుబ్బారెడ్డి, కందుల ప్రమీలారెడ్డి, చెన్ను విజయ, రవణమ్మ పాల్గొన్నారు.