చీరాల : ప్రకాశం జిల్లా అభివృద్దికి రూ.10వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు జాలా అంజయ్య కోరారు. సుందరయ్య భవనంలో ఆదివారం జరిగిన చీరాల ప్రాంతీయ కమిటి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా అన్ని రంగాలలో వెనుకబడిందన్నారు. జిల్లాలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. సాగునీళ్లు, తాగునీరు లేక ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి కొనసాగుతుందన్నారు. వలసలు నివారించాలంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.
నిధులు కేటాయించే వరకు సిపిఎం పోరాటం చేస్తుందన్నారు. వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని డిమాండు చేశారు. మొదటి దశ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఉధ్యమానికి సహకరించాయన్నారు. రెండో దశ ఉధ్యమంలో ఇంటింటికీ సిపిఎం నినాదంతో జిల్లా అభివృద్దిపై సంతకాల సేకరణ ఉధ్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో సిపిఎం ప్రాంతీయ కమిటి కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతరావు, దేవతోటి నాగేశ్వరరావు, కె యల్లమంద, పి లూకయ్య, గవిని నాగేశ్వరరావు, డాకా నారపరెడ్డి, పి సాయిరాం, వి మణిబాబు, జి గంగయ్య, రాజాలు పాల్గొన్నారు.