కొండేపి : వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ మూడే వేల కిలోమీటర్ల పాదాయత్ర సందర్భంగా నియోజకవర్గాల్లో చేపట్టిన పాదయాత్రల్లో భాగంగా కొండేపి వైఎస్ఆర్‌సిపి నాయకులు వరికూటి అశోక్‌బాబు చేపట్టిన యాత్ర నియోజకవర్గం మొత్తం చుట్టింది. పార్టీలో తనపై జరిగిన కుట్రలపై జిల్లా నాయక్తం చేసిన తీరుపై అశోక్‌బాబు చేసిన ఆరోపణలకు ప్రతిచర్యగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపధ్యంలో నియోజకవర్గంలోని వైసిపి కార్యకర్తలంతా తమ నేత అశోక్‌బాబేనంటూ ప్రకటించి తమ అభిప్రాయాన్ని పాదయాత్ర రూపంలో వ్యక్తం చేశారు. అశోక్‌బాబు స్థానంలో పార్టీ నియమించిన ఇన్‌ఛార్జి డాక్టర్ వెంకయ్య ఎక్కడా కనిపించకపోవడం… అశోక్‌బాబు వెంట అన్నీ గ్రామాల పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో కదిలి వచ్చారు.
వైఎస్ఆర్‌సిపిలో ఏర్పడ్డ వివాదాల నేపద్యంలో అశోక్‌బాబు పాదయాత్రకు పోలీసులు పెద్ద సంఖ్యలో పహారా కాశారు. డ్రోన్ కెమేరాలతో పర్యవేక్షిస్తూ యాత్ర వెంట పోలీసులూ వెంట నడిచారు. కొండేపి నుండి ప్రారంభమైన పాదయాత్ర మూడు రోజుల్లో నియోజకవర్గంలోని ఆరుమండలాలను చుట్టి శింగరాయకొండ చేరుకుంది. శింగరాయకొండలో ముగింపు సభ నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన అశోక్‌బాబును పోలీసులు నివారించారు. శుక్రవారం సాయంత్రం కావడం ఎలాంటి ఘటనలైనా జరిగితే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున విగ్రహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. కార్యకర్తలు మాత్రం ఎలాంటి ఘటనలు జరిగినా వైఎస్ఆర్‌కు దండ వేసి తీరాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో ఉదయం నుండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా రక్షణ కల్పించాం. చివరినిమిషంలో వివాదాలకు అవకాశం ఇవ్వవద్దని పోలీసులు చేసిన సూచనను అశోక్‌బాబు వెంట ఉన్న కొందరు సీనియర్లు అంగీకరించారు. దీంతో వివాదాలు లేకుండా యాత్ర ముగిసింది. యాత్రలో ఆరు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామకమిటీల నాయకులు పాల్గొన్నారు.