Home ప్రకాశం గ్రూపులతో వెంకయ్య… జనంతో ఎమ్యెల్యే స్వామి : కొండేపిలో ప్రజలకు దూరమవుతున్న వైసీపీ నేతలు

గ్రూపులతో వెంకయ్య… జనంతో ఎమ్యెల్యే స్వామి : కొండేపిలో ప్రజలకు దూరమవుతున్న వైసీపీ నేతలు

1083
0

ప్రకాశం : కొండపి ఎస్సీ నియోజకవర్గంలో వైసిపి నేతల తీరు ఆసక్తికరంగా మారింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ఓడిపోయిన వైస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్య చెప్పినట్టే అధికార యంత్రాంగం పని చేస్తోంది.

రాష్ట్రంలో వైస్సార్ సీపీ అధికారం చేపట్టడంతో వైసిపి ఓడిపోయిన నియోజకవర్గాలలో అధికారాన్నంతా వైసీపీ నేతలకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొండేపి నియోజకవర్గంలో అధికారం డాక్టర్ వెంకయ్య చేతుల్లోకి వచ్చింది. గత ఎన్నికల్లో వెంకయ్య ఓటమికి కారణమైన వైసీపీ గ్రూపులు అలాగే కొనసాగుతున్నాయి. వెంకయ్య ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిసారి ఆయన సమక్షంలోనే గ్రూపుల తగాదాలు, అరుసుకోవడాలు, కేకలు, ముష్టియుద్దాలు సాధారణమయ్యాయి. సొంత పార్టీలో వర్గపోరు ఆయనకు తలనొప్పిగా మారింది.

మరోప్రక్క కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ కరోనా క్వారంటైన్ సెంటర్లో సౌకర్యాలపై కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధరరెడ్డి సందర్శించారు. అక్కడ వసతులు సరిగాలేవని సింగరాయకొండ తహసీల్దార్ పై జిల్లా అధికారులకు పిర్యాదు చేస్తానని ప్రకటించారు. కొండేపి నియోజకవర్గంలో అధికారుల పనితీరుపై కందుకూరు ఎమ్మెల్యే విమర్శలు గుప్పించడం కొండేపి వైసీపీ శ్రేణులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారుల పనితీరుపై కొండేపి వైసీపీ నేతలు సక్రమంగా పర్యవేక్షణ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని వైసిపి కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. పార్టీ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ వెంకయ్య పట్టించుకోక పోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఒక వర్గం వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

నియోజకవర్గ శాసనసభ్యులు స్వామి మాత్రం తనదైన శైలిలో ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక సమస్యపై స్పందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఆయన మాట్లాడుతున్న తీరుకు ప్రజలు అభినందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు రాష్ట్రస్థాయి సమస్యలపై కూడా జిల్లాలో స్వామి ఒక్కడే స్పందిస్తున్నారు. గత నెలలో టి.నాయుడుపాలెం యువకుడు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ పై స్పందించిన స్వామి ఆ రాత్రంతా ఒంగోలు పోలీస్ స్టేషన్ వద్ద ఉండి ఆ యువకుడితో పాటు అటువంటి కేసులో అరెస్టు అయిన ఒంగోలు యువకుడ్ని కూడా విడిపించి జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. అదేవిధంగా టంగుటూరులో కరోనా టెస్టులు లేక ఒంగోలు, కొండపి వెళ్లి చేయించుకుంటున్న వారి ఇబ్బందులపై జిల్లా అధికారులతో మాట్లాడి టంగుటూరులో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు చేసేలా కృషిచేశారు.

జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన దళిత విఆర్ఏను కరోనాతో ఒంగోలు రిమ్స్ కి తరలించారు. ఐదురోజుల తర్వాత హాస్పిటల్ బయట వీఆర్ఏ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న అమానవీయ సంఘటనను మృతుడి బంధువుల ద్వారా తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే స్వామి రిమ్స్ వద్దకు వెళ్లి, రిమ్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచాడు. పొన్నలూరు మండలంలోని వైసీపీ నాయకుల ప్రలోభాలకు లొంగి అక్కడి తహశీల్దార్ రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలా నియోజకవర్గంలో ప్రతి సమస్యపై జోక్యం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.