Home ప్రకాశం వైఎస్ఆర్ సాక్షిగా కొండెపిలో ఎవరికి వారే….

వైఎస్ఆర్ సాక్షిగా కొండెపిలో ఎవరికి వారే….

1222
0

– గ్రూపులు గ్రూపులుగా వైఎస్ఆర్ కు నివాళి
– అధికారంలో ఉన్న తప్పని గ్రూపుల కుంపటి
– రిజర్వుడు నియోజకవర్గం కావడంతో అధికారంపై పట్టు కోసం పాకులాట
టంగుటూరు (దమ్ము) : నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ సాక్షిగా గ్రూపుల పోరు మరోసారి బయటపడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా టంగుటూరులో వైసీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నాలుగు గ్రూపులు, ఆరు దండలుగా ఘనంగా జరిగింది.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఎస్సీ సామాజిక నేతల మధ్య ఎన్నికలకు ముందు నుండి పోటీ నెలకొన్నది. ఈ పోటీని నివారించడంలో పార్టీ అధిష్టానం తీసుకున్న వైఖరి ఎన్నికల్లో ఓటమికి దారి తీసింది. ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అధికార యంత్రాంగంపై పట్టు సాధించేందుకు నేతల మధ్య ఏర్పడ్డ వైరుధ్యం కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. పార్టీ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ వెంకయ్య నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఆయన సమక్షంలోనే బహిరంగంగా కార్యకర్తలు గొడవలు పడుతున్నారు. మరోవైపు పార్టీలోని ఉన్నత వర్గాల నేతలు అధికారులపై పట్టు సాధించి తమకు అనుకూలమైన పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎవరికి వారే గ్రూపులు కట్టడం పార్టీ పరువును వీధిలో పెట్టినట్లు అయింది.

తాజాగా డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గ్రూపుల ఆధిపత్యం మరోసారి బట్టబయలైంది. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్యతో ఉన్న రావూరి అయ్యవారయ్య, సిరిపురపు విజయ భాస్కరరెడ్డి వర్గాలుగా విడివిడిగా కార్యక్రమాలు చేసుకున్నారు.

పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని అయ్యవారయ్యపై విమర్శలు చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బొడ్డపాటి అరుణ నిన్నటి వరకు విజయ భాస్కరరెడ్డి వర్గంలో ఉండి ఇటీవలే తిరిగి అయ్యవారయ్య వర్గంకు దగ్గరవడం గమనార్హం. ఇలా రెండు ఉన్నత సామాజిక వర్గాల నేతలు విడిపోవడంతో దిగువ సామాజికవర్గాల నాయకులు ఎటువుండాలో తెలియని అయోమయం ఏర్పడింది.

అయ్యవారయ్య గ్రూపుకు చెందిన టంగుటూరు మాజీ సర్పంచ్, వైసీపీ గ్రామ నాయకులు పుట్టా వెంకట్రావు, ఉపాధ్యాయులు తుల్లిబిల్లి అశోక్ బాబు ఇరుఉరు కలిసి నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, బాణసంచా కాల్చి,
నివాళులర్పించారు.

అనంతరం వైసిపి మండల అధ్యక్షుడు సూదనగుంట శ్రీహరిబాబు, సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, బొడ్డపాటి అరుణ ఒక గ్రూపుగా కొండపిరోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చి నాలుగురోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పత్రికా ప్రకటన ఇచ్చారు.

అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు సిరిపురపు విజయభాస్కరరెడ్డి గ్రూపుకు చెందిన వైసిపి జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, వల్లూరమ్మ ట్రస్ట్ మాజీ చైర్మన్ రమణారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు, కోటిరెడ్డి, కురుగుంట్ల స్నేహలత కలిసి ఒక గ్రూపుగా నాలుగు రోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వేరొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

దళితులే టంగుటూరులో వైసీపీకి అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. నిన్నటివరకు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ వెంకయ్యతో కలిసి ఉన్న నేతలు ఇప్పుడు సామాజిక వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తుండడం దళితులకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. ఎందుకంటే ఇక్కడ గతంలో వైసీపీలోని ఇరువర్గాల ఘర్షణలో తలలు పగిలి హాస్పిటల్ పాలయింది, పోలీసు కేసులతో జైళ్లకు వెల్లింది దళితులే.

మరోప్రక్క వైసిపి కొండపి నియోజకవర్గ మాజీ ఇంచార్జి వరికూటి అశోక్ బాబు వర్గీయులు మాత్రం అశోక్ బాబు కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ విధంగా వైఎస్సార్ పార్టీలో కమ్మ, రెడ్డి వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న గ్రూపులను అధిష్టానం ఒక్కటి చెయ్యలేకపోవడం పార్టీ ప్రతిష్ట దిగజారడానికి కారణమవుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.