Home ఆంధ్రప్రదేశ్ వైసిపి ప్రభుత్వం ఘోర వైఫల్యం : టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు ఎరిక్సన్ బాబు

వైసిపి ప్రభుత్వం ఘోర వైఫల్యం : టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు ఎరిక్సన్ బాబు

327
0

– నివర్ తుఫాన్ పంట నష్ట నమోదులో ప్రభుత్వం ఘోరవైఫల్యం
– ఆదిమూలపు సురేష్ గారు మీ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించండి
– రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతుంటే మీ నుంచి కనీస స్పందన లేదు.
– నియోజకవర్గంలో రైతులు తీవ్ర నష్టాలు పాలైతే మీరు కనీసం కన్నెత్తి చూడలేదు.
– లోకేష్ పర్యటన వల్లే మీరు రైతులకి పంట నష్ట సహాయాన్ని అంధించారు.
– తుఫాన్ పంట నష్ట నమోదు ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
– తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం
– టిడిపి సంక్షేమ పధకాలకి పేర్లు, రంగులు మార్చుకుంటున్న ప్రభుత్వం మీది.
ఒంగోలు : ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రజలకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని మీరు చెప్పడం అది ప్రజలకు కాదని ఇళ్ల స్థలాల చదును పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జేబులో వేసుకున్న మీ వైసీపీ నాయకులకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఒంగోలు టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలకు శాసనసభ సమావేశాలకు ఆహ్వానం లేదని, ఆ పత్రికలు బ్యాన్ చేశామని ప్రకటించిన మీకు పత్రికల విలువల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రభుత్వ ప్రకటనలతో మీ సాక్షి పత్రికకు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన దుయ్యబట్టారు.

మీరు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని ఎవరూ తప్పు పట్టరని, అలాకాకుండా అడవి భూములను, ఆవ భూములను, మైనింగ్ భూముల్లో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం వల్ల సంబంధిత వ్యక్తులు కోర్టుకు వెళ్లారని అన్నారు. దానిని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మీద నెట్టడం మీ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో మీరు ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి నెలల సమయం గడిచిపోతున్న మీరు ఇంకా మీనమేషాలు లెక్క వేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేక న్యాయ విరుద్ధమైన పనులు మీరు చేస్తూ హైకోర్టు చేత చివాట్లు తింటూ అసంబద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇవి కూడా అసత్యాలని మీరు మాట్లాడటం మీ విఘ్నతకే వదిలేస్తున్నమని అన్నారు.

యెర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ తుఫాన్ వల్ల నియోజకవర్గంలో రైతులు నష్టపోతే వారిని పరామర్శించడానికి, చనిపోయిన రైతు కుటుంబాల్లో ధైర్యం నింపడానికిగాని ప్రయత్నించని మీరు, పంట నష్ట పోయిన రైతుల్లో ధైర్యం నింపడానికి వచ్చిన నారా లోకేష్ బాబుని విమర్శించడం మీ స్థాయికి తగదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు సూచించారు. మంత్రిగా యెర్రగొండపాలెం నియోజకవర్గానికి ఈ 18నెలల కాలంలో ఏం చేశారో చెప్పే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ది గురించి మీరు చర్చలకు సిద్దామా! అని సవాలు విసిరారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ బాబు పనిచేసిన సమయంలో రాష్ట్రంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని దళితవాడలో నుంచి ప్రారంభించారని అటువంటి లోకేష్ ని విమర్శించడం మీకు మంచిది కాదని హితవు పలికారు. దళిత జాతికి చెందినటువంటి వ్యక్తివి జగన్ మోహన్ రెడ్డి ప్రాపకం కోసం నారా లోకేష్ బాబుని విమర్శించడం కాదని, దళిత జాతి అభివృద్ధి కోసం పాటు పడమని హితవు పలికారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే ఒక దళిత బిడ్డగా కనీసం వాటి మీద కూడా స్పంధించలేక పోయారని విమర్శించారు.

పుల్లలచెరువు మండలం ఇసుక త్రిపురవరంలో రెండు ఎకరాలు మిర్చి పంట వేసి తుఫాన్ వల్ల పంట పూర్తిగా నష్టపోయి కర్లకుంట గురవయ్య అనే రైతు గుండె ఆగి మరణిస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చి ఆర్థిక సహాయం కూడా అందించారని, టిడిపి రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసమని, తెలుగు దేశం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలకు పేర్లు మార్చుకుంటూ రంగులేసుకుంటున్న ప్రభుత్వం మీదని, మీరు సంక్షేమ పధకాల అమలుతో తెలుగుదేశం మీద ప్రజలు తిరగబడతారని చెప్పడం అత్యంత హాస్యాస్పదమని అన్నారు.