Home ప్రకాశం ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలి : వైసిపి

ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలి : వైసిపి

314
0

ఒంగోలు : ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టి వాస్తవ ఓటర్ల జాబితా తయారు చేయాలని వైసిపి ఒంగోలు నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరంలో అధికార పార్టీ అక్రమంగా ఓట్లు చేర్చుకుని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఒకే వ్యక్తికి ఒకే పేరు మీద వేర్వేరు పోలింగ్ స్టేషన్లో రెండు ఓట్లు, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులకు ఒంగోలులో ఓట్లు ఉన్నట్లు ఓటర్ల జాబితాలో నమోదైనట్లు ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఒక్క 24వ డివిజన్ పరిధిలోనే దాదాపు వంద దొంగ ఓట్లను అధికార పార్టీ నేతలు చేర్పించారని పేర్కొన్నారు. నగరంలో ఇలా దాదాపు పదివేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని అనుమానం వక్తం చేశారు.

అధికార యంత్రాంగం దిగువ స్థాయి సిబ్బందిని ప్రోత్సహించి దొంగ ఓట్ల చేర్పింపును తమకు అనుకూలంగా మలచుకుంటున్నారుని ఆరోపించారు. నగరంలో అధికార పార్టీ నాయకులు పోలింగ్ స్టేషన్లకు కట్టలు కట్టలుగా ఓటర్ల దరఖాస్తులను తీసుకువెళ్లి వాటిని జాబితాలో చేర్చాలని బిఎల్వోల పై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. వారి ఒత్తిడిని భరించలేక బీఎల్వోలు ఇటీవల తహసీల్దార్, ఆర్డీవోకు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీఆర్వోలు తహశీల్దార్ సహకారంతో ఓటర్ల జాబితాలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్డీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నగరంలో జరిగే ఓటర్ల జాబితా అక్రమాలపై ఈ పాటికే సిఇఓకు, జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

విశాఖ విమానాశ్రయంలో వైసిపి అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించకపోగా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్, గంటా రామానాయుడు, ఓబుల్ రెడ్డి, చిన్నపరెడ్డి, అశోక్ రెడ్డి, మీరావలి, కటారి శంకర్ పాల్గొన్నారు.