Home ప్రకాశం అశోక్‌బాబుకు అండ‌గా వెన్నంటిన కార్య‌క‌ర్త‌లు :  కొండేపిలో రెండుగా చీల‌నున్న వైసిపి

అశోక్‌బాబుకు అండ‌గా వెన్నంటిన కార్య‌క‌ర్త‌లు :  కొండేపిలో రెండుగా చీల‌నున్న వైసిపి

821
0

కొండపి :  “అధిష్టానం అంగీక‌రించ‌కుంటే స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగానైనా గెలిపించుకుంటాం. అశోక్‌బాబుకు వెన్నంటే ఉంటాం. పార్టీకి ఎవ్వ‌రూ లేని రోజుల్లో వ‌చ్చిన అశోక్‌బాబు మాకు ధైర్యం చెప్పి ఖ‌ర్చుపెట్ట‌కుని పార్టీని నిల‌బెట్టారు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం మొత్తం పార్టీకి క్యాడ‌ర్ తోడై బాగుంద‌నుకునే ద‌శ‌లో ఎవ్వ‌రినో తీసుకొచ్చి మీ నాయ‌కుడంటే అంగీక‌రించేందిలేదు. మా నాయ‌కుడు అశోక్‌బాబే.” అంటూ కొండ‌పి వైఎస్ఆర్‌సిపి మండ‌ల, గ్రామ‌స్థాయి క‌మిటీల నాయ‌కులు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. తాజాగా అధినేత జ‌గ‌న్ మూడు వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్త‌యిన సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గంలో అశోక్‌బాబు నాయ‌కత్వంలో జ‌గ‌న్‌తోపాటు అశోక్‌బాబుకు అండ‌గా పాద‌యాత్ర నిర్వ‌హించారు.

జూపూడి ప్ర‌భాక‌ర‌రావు వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్‌సిపికి నాయ‌కుడులేక కార్య‌క‌ర్త‌లంద‌రూ చెల్లాచెదుర‌య్యారు. ఎవ్వ‌రూలేని ద‌శ‌లో ఉద్యోగం వ‌దిలి వైఎస్ఆర్‌సిపి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల్లోకి అశోక్ బాబు వ‌చ్చారు. అప్ప‌టి నుండి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా, వారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పిలవగానే వచ్చే ఆత్మీయ బంధువు అయ్యాడు. పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపాడు. పార్టీని విచ్చిన్నం చేస్తున్న దుహంకారులు, స్వార్థపరులను సమర్థవంతంగా ఎదుర్కోన్నారు. తన కష్టంతో సంపాదించిన ధనాన్ని నాలుగు సంవత్సరాలుగా పార్టీ శ్రేయస్సు కోసం మంచి నీళ్లలా ఖర్చు చేశాడు. జిల్లాలో ఏ నాయకుడు చేయలేని పోరాటాలు చేశారు. రైళ్లుకు ఎదురెళ్లారు. రైల్వే అధికారులు పెట్టిన కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే ప‌రిస్థితి వ‌చ్చింది.

తన పనితీరుతో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను సైతం త‌న‌వైపు తిప్పుకున్నారని నాలుగేళ్లుగా అశోక్ బాబు చేసిన కృషిని కార్యకర్తలు వివరిస్తున్నారు. అటువంటి వ్యక్తిని నియోజకవర్గ పరిధిలోని కొంద‌రు చేసిన‌ కుట్రలకు బ‌లిచేయ‌డంపై ఆయ‌న అనుచ‌రుల్లో ఆగ్ర‌హం తెప్పించింది. నియోజ‌క‌వ‌ర్గంలో వాస్త‌వ ప‌రిస్థితుల‌పై కాకుండా వ్య‌క్తిగ‌త ఆదిప‌త్యం కోసం వైవీ సుబ్బారెడ్డి త‌మ‌నాయ‌కునిపై కుట్రలకు బీజం వేశార‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జిల్లాలో వైవిఎస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

నాలుగేళ్లుగా అశోక్ బాబు ఇంచార్చిగా పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే అశోక్‌బాబుకు సహకరించకుండా సుబ్బారెడ్డి డైరెక్షన్లో వేరుగా కార్యక్రమాలు చేసిన‌వారిపై ఎప్పుడూ చర్యలు ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆరు మండలాల్లోని కన్వీనర్లు, ముఖ్య నాయకులు అశోక్ బాబును కొనసాగించాలని కోరిన‌ప్ప‌టికీ త‌మ అభిప్రాయాన్ని ఎందుకు ప‌ట్టించుకోవ‌డంలేదని అంటున్నారు.

పార్టీకి, ఇంచార్జికి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా కార్యక్రమాలు చేసిన వారిని వదిలేసి పార్టీకోసం ఉద్యోగం వదులుకుని, సొంతనిధులు ఖర్చుపెట్టి జెండా నిలబడితే సస్పెండ్ చేయడంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అశోక్ బాబుని, 99 శాతం మంది నాయకులను, కార్యకర్తలను సస్పెండ్ చేసి అవమాన పరుస్తారాని ప్రశ్నిస్తున్నారు.

కేసులకు బయపడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే వ్యక్తి కార్యకర్తలకు ఏమి ధైర్యం ఇవ్వగలరని పెదవి విరుస్తున్నారు. “దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు.” అన్న జగన్ మాటలను కొండెపి ప్రజలు నిజం చేస్తారని పేర్కొన్నారు. 175సీట్లలో కొండెపి ఒక్కటి పోతే ఏంకాదని అనుకుంటే తీవ్రమైన నష్టం చూడాల్సి వస్తుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.