టంగుటూరు (దమ్ము) : 2023 -25 నూతన పారిశ్రామిక విధానంలో బీసీలకు కూడా ఎస్సీ, ఎస్టీల వలే రాయితీలు కల్పించాలని అఖిలభారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవ రాష్త్ర అధ్యక్షుడు బొట్లా రామారావు యాదవ్ డిమాండ్ చేశారు. 2020 – 25 పారిశ్రామిక విధానంలో బీసీలకు ఎస్సీ ఎస్టీల వలే రాయితీలు ఉండేవని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం నడుస్తున్న పారిశ్రామిక విధానంలో బీసీలకు జనరల్ కేటగిరి వారికి ఇచ్చే రాయితీలు మాత్రమే ఇస్తున్నారని, పరిశ్రమల శాఖ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల బీసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీల విషయాన్ని 2020-23 పారిశ్రామిక విధానం రూపకల్పన సమావేశాల్లో చర్చించలేదని, ఆ తరువాత పలువురు వినతి చేయగా కేవలం ఎస్సీ, ఎస్టీ లను మాత్రమే చేర్చి, బీసీలను విస్మరించారని, వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంలో బీసీలను చేర్చకపోవడం వల్ల బీసీలు పరిశ్రమలు స్థాపించలేక వెనకబాటుకు గురైనారని, 2023 మార్చితో ముగుస్తున్నటువంటి ఈ పారిశ్రామిక విధానంలో బీసీలు తీవ్రముగా నష్టపోయారని, నూతనంగా 2023 – 2025 కోసం నూతనంగా రూపొందించే పారిశ్రామిక విధానంలో వైయస్సార్ జగనన్న బడుగు వికాసంలో బీసీలను కూడా చేర్చి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల వలె రాయితీలు కల్పించి ప్రోత్సహించాలని కోరారు. అట్లాగే రాయితీ సొమ్మును ప్రతి ఆరుమాసములకు ఒకసారి విడుదల చేయడం ద్వారా ప్రయోజనం ఉన్నదని అన్నారు. తద్వారా అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు మేలు జరిగి పారిశ్రామిక పురోగతి నిజంగా జరుగుతుందని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శతాబ్ది అధ్యక్షులు బొట్లా రామారావు యాదవ్ కోరారు.
ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇంచార్జీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి విప్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షులు జంగాకృష్ణమూర్తి ద్వారా విన్నవించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, సీఎంతో ఈ విషయంపై చర్చించేటందుకు వారం రోజుల్లో జంగా కృష్ణమూర్తి, బొట్లా రామారావు యాదవ్ ల నేతృత్వంలో బీసీ నాయకుల బృందానికి అవకాశం కల్పిస్తామని వారు హామీ ఇచ్చినట్లు బొట్ల తెలిపారు.