తిరుమల : ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా వైఎస్ జగన్ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు. రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని, ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరారు. ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైఎస్ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రాన్ని జగన్‌కు అందించారు. ఈ సందర్భంగా జగన్ వెంట విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారి దర్శించుకున్నారు.