Home ఆంధ్రప్రదేశ్ సీబీఐకి జ‌గ‌న్ గ్రీన్‌ సిగ్న‌ల్..! లక్ష్యం అదే..!

సీబీఐకి జ‌గ‌న్ గ్రీన్‌ సిగ్న‌ల్..! లక్ష్యం అదే..!

364
0

అమరావతి : ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఒక వైపు పాల‌నా ప‌రంగా, మ‌రో వైపు రాజ‌కీయంగా ఎత్తుగ‌డ‌లల్లో ముందున్నారు. అందులో భాగంగా గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏపీలో సీబీఐకి రెడ్ సిగ్న‌ల్ ఇస్తూ జారీ చేసిన ఉత్త‌ర్వులును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసేందుకు నిర్ణియించింది. దీని ద్వారా జ‌గ‌న్ ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ సైతం సీబీఐ బాధితుడే. కానీ ఇప్పుడు స్థానం మారింది. అధికారిక హాదాలో ఉన్నారు. స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నారా..!

చంద్ర‌బాబు ఉత్త‌ర్వులు ర‌ద్దు..!
కేంద్రంతో గ్యాప్ వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్‌ లేకుండా ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టే అధికారం సీబీఐకు లేకుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణను జగన్‌ సర్కారు రద్దు చేయబోతోంది.

కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏరాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆయా కేసులకు సంబంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో కన్సెంట్‌ తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ కక్ష సాధించేందుకు వినియోగిస్తోందన్న ఆరోపణలతో గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కన్సెంట్ ర‌ద్దు చేసింది. అయితే ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావటంతో తిరిగి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

ఎంద‌కింత తొంద‌ర‌గా ఈ నిర్ణ‌యం..?
అధికారంలోకి వ‌చ్చి నాలుగు రోజులు కూడా పూర్తి కాకుండ‌నే జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జ‌గ‌న్ సైతం గ‌త‌లో సీబీఐ బాధితుడే..! అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సీబీఐకి ఏపీలో ఎంట్రీ లేకుండా నిర్ణ‌యం తీసుకున్న వేళ‌ జ‌గ‌న్ నేరుగా స్పందించ‌క‌పోయినా వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసారు.

కేంద్ర ప్ర‌భుత్వం చంద్ర‌బాబు, ఆయ‌న కోట‌రీ పైన సీబీఐ విచార‌ణ‌ల‌కు ఆదేశిస్తుంద‌నే భ‌యంతోనే సీబీఐకి అనుమ‌తి ర‌ద్దు చేసార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేస్తూ..సీబీఐకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వానికి దారి ఇవ్వ‌టంలో బాగంగానే..రూట్ క్లియ‌ర్ చేస్తున్నార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం ప‌క్కా వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణ‌య తీసుకున్నార‌నే వాద‌న మొద‌లైంది.

టీడీపీలో ఎందుకు టెన్ష‌న్..??
జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణ‌యంతో టీడీపీలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. జ‌గ‌న్ ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన వెంట‌నే జ‌రిగిన మీడియా స‌మావేశంలోనే కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాజ‌ధాని భూ స్కాం చాలా పెద్ద‌ద‌ని, దీని పైన విచారణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. అదే విధంగా అనేక కాంట్రాక్టుల్లో అవినీతి చోటు చేసుకుంద‌ని చెప్పారు.

ఇక‌, ఇప్పుడు ఈ నిర్ణ‌యం ద్వారా జ‌గ‌న్ గ‌త వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు, అవినీతిపైన సీబీఐ విచార‌ణ కోరుతారా అనే అనుమానం అధికార వ‌ర్గాల్లో మొద‌లైంది. దీనికి సంబంధించి ఈనెల 8న జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో స్ప‌స్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.