చీరాల : యువత చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. తనతోపాటు తన తనయుడు గౌరీ అమర్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మండలంలోని వాడరేవు నుండి పచ్చ జెండా ఊపి ఆయన ప్రారంభించారు. 60 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పంజాబ్, కేరళ, చతిస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి యువత సైకిల్ రేస్ పోటీల్లో పొల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి యువనేత మద్దలూరి గౌరీ అమర్నాథ్ మాట్లాడుతూ 60కిలోమీటర్ల విభాగంలో ప్రథమ బహుమతి రూ.1లక్ష నుండి 7వ బహుమతి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 20కిలోమీటర్ల ఇండియన్ మేడ్ సైకిల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విజేతలకు వరుసగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.20వేలు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
60కిలోమీటర్ల విభాగంలో కర్ణాటకకు చెందిన సిద్ధార్థలింగ్ ప్రథమ స్థానంలో నిలిచి రూ.1లక్ష, ద్వితీయ స్థానంలో ఢిల్లీకి చెందిన అర్షద్ ఫరీద్ రూ.50వేలు, తృతీయ స్థానంలో కర్ణాటకకు చెందిన నవీన్ రూ.30వేలు, 4వ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సంజయ్ పటేల్ రూ.20వేలు, 5వ స్థానంలో కేరళకు చెందిన సుదేవ్ ఎంబి రూ.10వేలు, 6వ స్థానంలో కర్ణాటకకు చెందిన బాసు ఎంటి రూ.10వేలు, 7వ స్థానంలో కర్ణాటకకు చెందిన వరుణ్ రూ.5వేలు గెలుపొందరు. 20కిలోమీటర్ల విభాగంలో ప్రధమ స్థానంలో తమిళనాడుకు చెందిన ఎస్ అబ్రహం రూ.50వేలు, ద్వితీయ స్థానంలో తమిళనాడుకు చెందిన రాజా పాండి రూ.30వేలు, తృతీయ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సోహెల్ రియాజ్ రూ.20వేలు గెలుపొందారు. విజేతలకు చీరాల, బాపట్ల శాసన సభ్యులు కొండయ్య, వేగసేన నరేంద్రవర్మ, తెలుగుదేశం నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాధ్ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో బహుమతులు అందజేశారు. 60 కిలోమీటర్ల విభాగంలో రాజమండ్రికి చెందిన వేణుగోపాల్, 20కిలోమీటర్లు విభాగంలో పాకాల పాండు గతంలో శబరిమల సైకిల్ యాత్ర 10సార్లు పూర్తి చేశారని హర్షం వ్యక్తం చేస్తూ రూ.10వేలు కన్సోలేషన్ బహుమతి అందజేశారు.