టంగుటూరు : ప్రముఖ వ్యాపారవేత్త, టంగుటూరు గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు పత్తిపాటి వెంకట సుబ్బారావు అలియాస్ ఎర్రబ్బాయి ఆదివారం కరోనాతో హైదరాబాదులోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 1934లో టంగుటూరు గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో చిన్న వెంకయ్య – చిన్నమ్మలకు రెండవ సంతానంగా జన్మించారు. వెంకటసుబ్బారావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎల్సి పూర్తి చేసి,1955లో నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. కాలేజీలో చదివే సమయంలో కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ పార్టీ చీలిక అనంతరం సీపీఐలో ఉంటూ స్థానిక నాగేశ్వరస్వామి (శివాలయం) దేవస్థానానికి చెందిన భూమిలో పేదల చేత గుడిసెలు వేయించి రాజీవ్ కాలనీ ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ అభిమానంతో ఆయన పొగాకు కంపెనీలోని ఆఫీసులో మార్క్స్, లెనిన్, మావో చిత్రపటాలు ఇప్పటికీ అలాగే ఉంచుకున్నారు. ఆయన నాగేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ గా, పోలేరమ్మ గుడి సేవా కార్యక్రమాలలో ప్రముఖులుగా వున్నారు. టీటీడీ కళ్యాణ మండపం ప్రక్కన క్రతువుశాల తన స్వంత నిధులతో నిర్మించారు. గోవిందమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు కలిగారు. ఇద్దరు కుమారులు వ్యాపార రంగంలో వున్నారు. ఆయన మొదట కలప వ్యాపారంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అనంతరం గోల్డెన్ లీవ్స్ టుబాకో కంపెనీ వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పొగాకు వ్యాపారం రంగంలో ప్రముఖులుగా నిలిచారు.
అలాగే బొగ్గు, ఎరువులు, రొయ్యల చెరువులు వంటి వ్యాపారాలు చేశారు. టంగుటూరులోని అప్సర, శ్రీనివాస సినిమా థియేటర్లు వారివే. మాదాల రంగారావు హీరోగా నటించిన ఎర్రమల్లెలు సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడా రాజాలింగో… అనే పాటలో కిరాణా షాపు యజమానిగా కనిపిస్తారు. ఎన్టి రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో సుబ్బారావు ఆ పార్టీలో చేరిపోయారు. గత 25ఏళ్లుగా చనిపోయేంతవరకు టంగుటూరు గ్రామ తెలుగుదేశం అధ్యక్షులుగానే ఉన్నారు. టీడీపీ నుండి ఎంపీటీసీగా, పంచాయతీ వార్డు మెంబర్ గా పనిచేశారు. గ్రామంలో పెద్దగా, తెలుగుదేశంకు పెద్దదిక్కుగా క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన అందరికీ ఎర్రబ్బాయిగా చిరపరిచుతుడు.
ఆయన గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చేర్పించారు. ఆదివారం మృతి చెందడంతో, కరోనా దృష్ట్యా హైదరాబాద్ లోనే దహణసంస్కారాలు పూర్తి చేశారు. దహన సంస్కారాలను ఆయన కుటుంబ సభ్యులు లైవ్ లో చూశారు. పత్తిపాటి వెంకట సుబ్బారావు మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం వెలిబుచ్చారు.
దామచర్ల జనార్దన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు
వెంకటసుబ్బారావు గ్రామంలో పెద్దమనిషి, కష్టపడి ఎన్నో వ్యాపారాలు చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. పార్టీకి మొదటి నుండి పెద్దదిక్కుగా ఉన్నారని, వారి పిల్లలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కరోనా వల్ల మృతిచెందడం బాధకలిగే విషయం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు.
తెలుగుదేశం పార్టీ నిర్మాణం నుండి పార్టీకి నిబద్ధతతో పనిచేశారని, మంచి వ్యక్తిని కోల్పోవడం బాధకలిగించే విషయం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియపరిచారు.
బెల్లం జయంత్ బాబు, ప్రముఖ పారిశ్రామిక వేత్త,
టంగుటూరు మాజీ సర్పంచ్.
మా ఆత్మీయులు, గ్రామంలో పెద్దలు, నిరాడంబరజీవి,
మృదుస్వభావి వెంకటసుబ్బారావు చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
దామచర్ల సత్య, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు.
సీనియర్ నాయకులు, మంచి మనిషి, పార్టీకోసం ఎంతో సేవ చేసిన గొప్ప వ్యకిని కోల్పోవడం బాధకలిగే విషయం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
చదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు మాజీ ఎంపీపీ.
కపటంలేకుండా మాట్లాడే మంచి మనిషి, పార్టీకోసం కష్టపడిపనిచేస్తూ, పార్టీకి మంచి సలహాలు ఇచ్చేవారు.
అటువంటి మనిషి కరోనా వల్ల చనిపోవడం వల్ల కడసారి చూడడానికి కూడా అవకాశం లేకపోవడం బాధకలిగించే విషయం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
కామని విజయకుమార్, తెలుగుదేశం టంగుటూరు మండల అధ్యక్షులు.
తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుండి పార్టీ కోసం నిరంతరం పనిచేసారన్నారు. ఆయన సేవలు మరువలేనివున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.