హైదరాబాద్: రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన రంగస్థలం చిత్రంలోని ‘వేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగే ఎంత సక్కగున్నావే’.. అంటూ వచ్చిన పాట ప్రస్తుతం అందరి నోటా నానుతోంది. సమంత కథానాయికగా నటించిన చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
ఈ పాట మేకింగ్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. పాటలోని సన్నివేశాల్ని తెరకెక్కించిన విధానాన్ని చూపించారు. రాజమండ్రిలోని అందమైన పల్లెటూరిలో ‘ఎంత సక్కగున్నావే..’ ఎంత చక్కగా తెరకెక్కించారో చూస్తే అబ్బురపర్చింది. చిట్టిబాబు పాత్రకు చరణ్, రామలక్ష్మి పాత్రకు సమంత ప్రాణం పోశారు. ఈ చిత్రంతో నటులుగా వీరిద్దరూ మరో మెట్టు ఎక్కారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలను చూస్తే సుకుమార్ ఎంత ప్రేమతో ఎంత చక్కగా నిర్మించారో అర్థమవుతోంది. ఇప్పుడు ఈ పాట మేకింగ్ వీడియో సోషల్‌మీడియాలో అభిమానుల అంచనాలను పెంచుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మిస్తూ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985 కాలంనాటి వాతావరణాన్ని తలపిస్తూ పల్లెటూరి నేపథ్యంలో సినిమాను తీస్తున్నారు. ‘రంగస్థలం’ అనే ఊరిలో జరిగిన రాజకీయ పరిణామాలే ఈ చిత్ర కథకు మూలం.