Home బాపట్ల పేదల వైద్యానికి అండగా ‘ఏలూరి’

పేదల వైద్యానికి అండగా ‘ఏలూరి’

5
0

పర్చూరు (DN5 News): ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందుకోలేని పేదలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అండగా నిలుస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 8 మంది బాధితులకు లోకల్ ఆథరైజేషన్ (LOC) ద్వారా రూ.12 లక్షలకుపైగా వైద్య సహాయం మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పర్చూరుకు చెందిన కనమర్లపూడి లక్ష్మి కిడ్నీ సమస్యతో పాటు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని ఆంధ్ర ప్రైమ్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం వైద్య చికిత్స ఖర్చులు భరించలేక ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఆయన రూ.2,02,878 ఎల్ఓసీ మంజూరు చేయించారు.

పునూరుకు చెందిన పఠాన్ నజురున్ గర్భాశయంలో గడ్డలతో రెండేళ్లుగా బాధపడుతుండగా చికిత్స కోసం రూ.1,05,838 ఎల్ఓసీ మంజూరు చేశారు. వంకాయలపాడుకు చెందిన పల్లెపు అంజమ్మకు నడుము ఎముక సమస్యతో శస్త్రచికిత్స అవసరమవగా రూ.1,25,185 మంజూరు చేశారు. మార్టూరుకు చెందిన షేక్ మున్నికి గర్భసంచి సమస్యకు చికిత్స కోసం రూ.58,173 అందించారు. జాగర్లముడికి చెందిన శిశువు జన్మనుంచే శ్వాస సమస్యతో బాధపడుతుండగా మెరుగైన వైద్యం కోసం రూ.2,46,288 ఎల్ఓసీ మంజూరు చేశారు. స్వర్ణ గ్రామానికి చెందిన నున్న నాగమణికి గర్భాశయ సంబంధిత సమస్యకు రూ.99,157 అందించారు. గంగవరంకు చెందిన బోడెంపూడి రాజలక్ష్మికి గుండె శస్త్రచికిత్స కోసం రూ.2,04,260 మంజూరు చేశారు.

నాగరాజుపల్లికి చెందిన శిశువుకు తక్కువ బరువుతో జననం కావడంతో వైద్య చికిత్స కోసం రూ.2,20,633 ఎల్ఓసీ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ‘పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం లేక ఇబ్బందులు పడకూడదు. అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తాం’ అని తెలిపారు.