విజయవాడ : మహానాడు సందర్భంగా టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. జెండాలు, స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలతో విజయవాడ నగరం పుసుపు వర్ణ శోభితంగా మారింది. సభా ప్రాంగణానికి వెళ్లే దారిలో డివైడర్లకు రంగులు వేసి అందంగా అలంకరించారు. వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో ఎటు చూసినా పసుపు జెండాలే కనిపిస్తున్నాయి. వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎన్టీఆర్, చంద్రబాబు కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభా ప్రాంగణం లోపల పైకప్పును పసుపు, తెలుపు రంగుల వస్త్రాలతో అలంకరించారు.
ఆకర్షనీయంగా ప్రధాన వేదిక..!
టిడిపి చరిత్రలోనే ఈసారి మహానాడుకు అతి పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 400 మంది కూర్చునేవిధంగా వేదిక ఏర్పాటు చేశారు. వేదిక పై ఒకపక్క ఎన్టీఆర్, మరోపక్క చంద్రబాబు చిత్రాలు ఉంచారు. అటూ, ఇటూ వివిధ కులవృత్తుల చిత్రాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నమూనాలు కళ్లకు కట్టేలా వేదిక ముందు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పక్కనే 30/40 అడుగులతో మరో వేదిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్, వైద్య, రక్తదాన శిబిరం, డ్వాక్రా ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు వరుసగా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ చరిత్రను కళ్లకు కట్టేలా, తెలుగుదేశం ప్రస్థానం, చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ప్రధాన ఘట్టాల్ని వివరించే ఫొటోలతో ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించారు.
అందరికి సౌకర్యవంతంగా..!
రోజుకు 36-40 వేల మంది వస్తారని అంచనా వేశారు. ప్రధాన ప్రాంగణంలో 15 వేల మంది కూర్చునేందుకు కుర్చీలు వేశారు. జనరల్ బాడీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, మహిళలకు వేర్వేరు గ్యాలరీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, అటు తెలంగాణ నుంచి వచ్చే వారికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రాంగణమంతా ఏసీలు, కూలర్లు పెట్టారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా రెయిన్‌ప్రూఫ్ పైకప్పు వేశారు. వచ్చే ప్రతినిధులకు ప్రత్యేకంగా పాస్‌లంటూ ఏమీ ఇవ్వడం లేదు. పార్టీ సభ్యత్వ కార్డుతో వస్తే… రిజిస్ట్రేషన్ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుని పసుపురంగు ఫైల్ ఒకటి ఇస్తారు. అది ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఎవరైనా సభ్యత్వ కార్డు మర్చిపోయి వచ్చినా, అసలు కార్డే లేకపోయినా… అక్కడికక్కడే కొత్తవి ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్‌కు 24, గుర్తింపు కార్డుల జారీకి 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పసందైన విందు..!
వారూ, వీరూ అన్న తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన వంటలు సిద్ధం చేస్తున్నారు. రోజూ సుమారు 25 వేల మందికి ఉదయం టిఫిన్, 40 వేల మందికి రెండు పూటలా భోజనం సిద్ధం చేస్తున్నారు. 20కిపైగా వంటలు వడ్డించనున్నారు. ముఖ్యులకు ప్రధాన వేదిక వెనుకే ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. మిగతా ప్రతినిధులకు 8 భోజన కేంద్రాలు ఉన్నాయి. 2 వేల మంది కూర్చుని తినేలా, మిగతావారు బఫే భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. నారాయణ, చైతన్య, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన వసతిగృహాల్లో 15వేల మందికి బస ఏర్పాటు చేశారు. 11 చోట్ల పార్కింగ్ వసతి కల్పించారు. వాహనాల డ్రైవర్లకు వారున్న చోటుకే భోజనాలు అందిస్తారు. మహానాడు రద్దీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు.