Home బాపట్ల పశుసంవర్ధక శాఖపై వైసిపి నిర్లక్ష్యం : శాసన సభలో ఎంఎల్‌ఎ ఏలూరి

పశుసంవర్ధక శాఖపై వైసిపి నిర్లక్ష్యం : శాసన సభలో ఎంఎల్‌ఎ ఏలూరి

8
0

పర్చూరు (DN5 News) : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పాడి పరిశ్రమను గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) అసెంబ్లీలో ఆరోపించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన పాడి పరిశ్రమను నిర్వీర్యం చేశారని అన్నారు. రాష్ట్ర జిఎస్‌డీపీలో 11.23 శాతం వాటా కలిగి ఉందని గుర్తుచేశారు. కనీసం మందులు అందించకుండా, సిబ్బందిని నియమించకుండా గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క వెటర్నరీ డాక్టర్‌ను నియమించలేదని, ఒక్క కొత్త భవనం మంజూరు చేయలేదని అన్నారు. గతేడాదిన్నర కాలంగా సిఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో పశుసంవర్ధక శాఖను కొంతమేర ప్రక్షాళన చేశారని పేర్కొన్నారు.

ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయాలి
2014-19 టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన 275 వెటర్నరీ ఆసుపత్రి భవనాలకు ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కృషి చేసిందని, కొన్ని పూర్తయ్యాయని, కొన్ని పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తయిన వాటికి కొన్ని బిల్స్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పర్చూరు, కొండేపి నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. 2019 – 24లో గత ప్రభుత్వంలో ఒక్క కొత్త భవనం మంజూరు చేయలేదన్నారు. గతంలో అసంపూర్తిగా ఉన్న బిల్డింగులకు తక్షణం నిధులు కేటాయించి పెండింగు బిల్లులు చెల్లించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టాలని కోరారు.

ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
1983లోనే ఎన్టీఆర్ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌ ఉండాలని ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్టీఆర్ సంకల్పాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని అన్నారు. కొత్త జిల్లాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో 24గంటలు సేవలు అందించే వెటర్నరీ ఆసుపత్రులు నిర్మించాలని సూచించారు.

సబ్సిడీలు పునరుద్ధరించాలి
గత ప్రభుత్వం నిలిపివేసిన చాఫ్ కట్టర్లు, పశుగ్రాసం, పశుగ్రాస విత్తనాల సబ్సిడీలు తిరిగి ప్రారంభించాలని కోరారు. అత్యధిక నిధులు కేటాయించి పాడి రైతులకు అండగా నిలవాలని కోరారు. పాడి పరిశ్రమ పునరుద్ధరణతో గ్రామీణ ఉపాధి పెరుగుతుందని తెలిపారు. రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని అన్నారు.