చీరాల : చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు వైసిపి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ ఈపురుపాలెంలోని భావనారుషిపేటలో పర్యటించారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించారు. పరుగులు, రంగులు, నూలుపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మగ్గం గుంటలోకి దిగి నేత నెస్ పద్ధతులు తెలుసుకున్నారు. కాటూరి విజయలక్ష్మి, కాటూరి చంచయ్య, బుదాటి యజ్ఞానారాయణలను చేనేత వృత్తిలో ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగులు, రసాయనాలతోపాటు తదేకంగా సన్నని దారాలు చూడటం వల్ల కంటి చూపు సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
వైఎస్సార్ ఉన్నపుడు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని ఇప్పుడు సక్రమంగా చేయలేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. అన్ని విషయాలు విన్న బాలాజీ చేనేత కార్మికులతో మాట్లాడారు. భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుందని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రకటించారని చెప్పారు. చేనేతలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఆయన వెంట ఎంపిటిసి గోలి ఆనందరావు, సీనియర్ నాయకులు గోలి వెంకటరావు, కటకం జగదీష్, గుడ్డన్టీ శివ ఉన్నారు.