Home ప్రకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు వైసీపీలో జగనన్న గొప్ప గౌరవం ఇచ్చారు

బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు వైసీపీలో జగనన్న గొప్ప గౌరవం ఇచ్చారు

185
0

– ఆదిమూలపు సురేష్,రాష్ట్ర మంత్రి,కొండపి ఇంచార్జ్- అశోక్ బాబు వర్గీయులు ఎక్కువగా హాజరు

– అసమ్మతి వర్గం డుమ్మా

టంగుటూరు(దమ్ము) : ప్రజా సాధికారిత యాత్రలో సీనియర్ నాయకులంతా విజయసాయి రెడ్డి నుండి వైసిపీ నాయకులంతా కింద కూర్చున్నారని, కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను మాత్రమే వేదికపై కూర్చోబెట్టి గొప్ప గౌరవం వైసీపీలో ఆ వర్గాలకు ఇచ్చారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కొండపి వైసీపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరులోని డిసైడ్ ఫంక్షన్ హాల్ లో గురువారం జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గత 17ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను. కొండపి నియోజకవర్గంలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పార్టీ పంపినటువంటి ఒక సైనికుడిగా, కార్యకర్తగా ఇక్కడికి రావడం దైవసంకల్పంగా భావిస్తున్నాను అన్నారు. 2014లో సంతనూతలపాడులో వైసీపీ ఖాతాలోకి మొదటి విజయాన్ని తీసుకొచ్చానన్నారు. తాను 15ఏళ్లు రాజకీయంలో, వాసన్న 30ఏళ్లు రాజకీయాల్లో ఉన్నారన్నారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయితే వాసన్న ఆరుసార్లు ఎమ్మెల్యే అన్నారు. వాళ్లతో పాటు వాళ్లకిచ్చిన గౌరవం జగనన్న తనకు ఇచ్చాడన్నారు. చంద్రబాబు తనను చెత్త అన్నమాట దీవెనగా తీసుకుంటున్నాను అన్నారు. ఎమ్మెల్యే స్వామి తనను వలస పక్షి అన్నారని, రాబోయే రోజుల్లో తాను వలస పక్షినో ఆయన జైలు పక్షినో ప్రజలే తెలుస్తారన్నారు. నియోజకవర్గాల మార్పిడి ఈరోజు వచ్చింది కాదని, చంద్రబాబు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చారని, లోకేష్ బాబు ఆయన నిలబడిన నియోజకవర్గం పేరు కూడా పలుకులేరని, ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ దాడి చేయాలనే ఆలోచనతోటి ఎన్నికలవేడి రాజుకునేకొద్దీ ఇంకా దాడి చేస్తారన్నారు. ఎన్ని సర్వేలు చూసిన జగనన్న చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నభూతో నాభవిష్యత్ అన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో రు.2.51లక్షల కోట్లు కరోనా సమయంలో కూడా ఆపకుండా అందించిన పార్టీ అన్నారు. వయసులో చిన్న పార్టీ అయినా, భవిష్యత్తు వున్న పార్టీ. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలను మించి చరిత్రను తిరగరాసే దిశలో కనీసం 20ఏళ్లు అధికారంలో ఉండబోయే పార్టీ అని గుర్తుంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వలేము, అందరికీ ఒకేసారి ఇవ్వలేము. వారి వంతు వచ్చేసరికి సమయం పడుతుందన్నారు. కష్టపడి పని చేసే వాళ్లకు, సీనియర్లకు గుర్తింపు లేదని అనుకోవద్దన్నారు. కొండేపి నియోజకవర్గంలో 283పోలింగ్ స్టేషన్లలో 63 టంగుటూరు మండలంలో ఉన్నాయన్నారు. నెల రోజుల్లో ఎన్నికలు రానున్నాయి కాబట్టి మండలంలో 63బూతు కన్వీనర్లను ఏర్పాటు చేసుకోవాలని, ఆ బూతు కన్వీనర్ల వల్లే ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాను అన్నారు. అనేక కారణాలతో గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రానించలేకపోయామని, కానీ టంగుటూరు మండలంలో ఓట్లకు, నాయకులకు, వైసీపీ బలానికి కొదవ లేదని, వైసిపి అనేక సందర్భాలలో టంగుటూరు మండలంలో తగ్గేదే లేదని నిరూపించిందన్నారు. ఇక్కడ కావాల్సింది నేర్పరితనం, అందరిని కలుపుకుని పోవడమేనన్నారు. 2014లో 63 సీట్లు వైసీపీకి ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చినది మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, జడ్పీటీసీ అరుణ, చింతపల్లి హరిబాబు, సత్యన్నారాయణ రెడ్డి, పుట్టా వెంకట్రావు, బీనీడి ఉదయకుమార్, చిడిపోతు సుబ్బారావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అశోక్ బాబు వర్గీయులు ఎక్కువగా పాల్గొన్నట్లు సమాచారం.

డుమ్మా కొట్టిన సీనియర్ నాయకులు, కొన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ

ఈ కార్యక్రమానికి మండలంలోని మాజీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, సీనియర్ నాయకులు సూదనగుంట గుంట నారాయణ, వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం జోన్ 5 ఇంచార్జ్, అఖిలభారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల రామారావు, కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బొడ్డపాటి అరుణ, టంగుటూరు వైస్ ఎంపీపీలు రావెళ్ల ప్రదీప్, టంగుటూరు సొసైటీ అధ్యక్షులు రావూరి ప్రవీణ్, టంగుటూరు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గొల్లపూడి సునీత, మండల కో ఆప్షన్ సభ్యులు నజీర్, సోమేపల్లి మురళీ కృష్ణ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం.