Home బాపట్ల కార్మికులకు జీతం, పనిముట్లు తక్షణమే ఇవ్వాలి

కార్మికులకు జీతం, పనిముట్లు తక్షణమే ఇవ్వాలి

6
0

చీరాల (DN5 News) : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికులకు మార్చి నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం వసంతరావు అన్నారు. వెంటనే కార్మికుల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మంగళవారం ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ప్రతి నెల 1 లేదా 2వ తేదీల్లో జీతాలు చెల్లిస్తుండగా మార్చి నెల జీతం ఏప్రిల్ 7వ తేదీ వచ్చినా అందలేదని అన్నారు. జీతాల ఆలస్యం కారణంగా కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఈస్టర్ పండుగ కూడా కార్మికులు సరిగా జరుపుకో లేకపోయారని పేర్కొన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సకాలంలో రాకపోతే కుటుంబ పోషణ కష్టసాధ్యం అవుతుందని అన్నారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు, నెట్టుడు బండ్లు, చీపుర్లు, పారలు, సరిపడా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాటిని తక్షణమే సమకూర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ జోసఫ్ డానియిల్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి ఇమ్మానియేలు, చిమట వీరస్వామి, డి సామేలు, బడుగు కుమారి, భవాని, యశోద, రాంబాబు, మరియమ్మ పాల్గొన్నారు.