ఢిల్లీ : రెండు వారాలు క్రితం బురారీ కుటుంబానికి చెందిన 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే ఝూర్ఖండ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఝూర్ఖండ్‌లోని హజరీబాగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణాలతోనే వారంతా తనువు చాలించినట్లు ఇంట్లో దొరికిన సుసైడ్ నోట్ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హజరీబాగ్‌కు చెందిన మహావీర్ మహేశ్వరి(70) వృత్తిరీత్యా హోల్‌సేల్ డ్రైప్రూట్స్ వ్యాపారం చేస్తున్నారు. అతనికితోడుగా కుమారుడు నరేశ్ మహేశ్వరీ(40) కూడా వ్యాపారంలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థికంగానూ నష్టపోవడంతో క్రమంగా అప్పులు పెరిగినట్లు తెలిపారు. ఈ కారణంతోనే ఇంటిల్లిపాది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం మహావీర్, అతని భార్య కిరణ్ మహేశ్వరి(60), నరేశ్, అతని భార్య పృథ్వీ మహేశ్వరి(35), వారి సంతానం అమన్(10), అన్వి(7) విగతజీవులై కనిపించారూ. అది గమనించిన పొరుగింటి వారు అందించిన సమాచారంతో ఈ సామూహిక ఆత్మహత్యల విషయం బయటకు వచ్చింది.
ఈ క్రమంలో నరేశ్ మృతదేహం అపార్టెమెంట్ ప్రధాన గేట్ వద్ద నేలపై పడి ఉండగా, కుటుంబ పెద్ద మహావీర్ ఇంట్లో ఒక గదిలో ఉరేసుకొగా, అదే గదిలో మనవడు అమన్ గొంతుపై గాయాలతో కనిపించాయి. అమన్ చిన్న పిల్లాడు కావడంతో ఉరేసే అవకాశం లేకపోవడంతో కుటుంబసభ్యులే చంపేసినట్లు సుసైడ్ నోట్ ద్వారా తెలిసింది. మరోక గదిలో మహావీర్ భార్య కిరణ్ కూడా ఉరేసుకోగా, కోడలు పృథ్వీ మహేశ్వరీ మృతదేహం మంచంపై కనిపించింది. ఇక ఇంట్లో అందరి కంటే చిన్న పిల్ల అయిన అన్వి మృతదేహం నోట్లో గుడ్డలతో డైనింగ్ రూమ్ సోఫాలో కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థిక కారణాలతోనే సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు సుసైడ్ నోట్ ద్వారా తెలిసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.