పర్చూరు : ఆమె పెట్టుకున్న వివాహేతర అక్రమ సంబంధం ఆమెతోపాటు ఆమె భర్త ప్రాణాలను బలిగొన్నది. ఇద్దరు బిడ్డలను అనాధలను చేసింది. ఇద్దరు బిడ్డలతో సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అక్రమం సంబంధం పిడుగు పడింది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఇద్దరూ వాదులాడుకున్నారు. అక్రమ సంబంధం పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. అది గమనించిన బంధువుల, పెద్దనుషులు సర్దిచెప్పారు. కేసులు లేకుండా ఇద్దరూ ఒద్దికగా ఉండమని హితవు చెప్పి కొద్దిరోజులు ఉన్న ఊరువదిలి వేరే ఊరులో ఉండాలని సూచించారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి సొంత ఇంటికి చేరారు. ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్తలేని సమయంలో ఇంటిలోకి రానివ్వడాన్ని గమనించిన భర్త వాదనకు దిగాడు. ఇద్దరిమద్య పెరిగిన వాగ్వివాదం ఇద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. ఇద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వీరి ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడాన్ని చూసిన ఆ చిన్నారులు ఏం చేయాలో దిక్కు తెలియక చేస్తున్న రోధనలు చూపరులకు సైతం కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లి ఎస్‌సి కాలనీకి చెందిన కుంచాకు కిషోర్‌బాబు(30) అతని భార్య సునీత (27) ఇంట్లోనే పొలానికి వేసే పురుగు మందు తాగి ఒకే మంచంపై ఆదివారం మృతి చెంది ఉన్నారు. అది గమనించిన బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతులకు ఆరవ తరగతి చదువుతున్న కుమార్తె రాజ్యలక్ష్మి, మూడో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ ఉన్నారు. బంధువులు, పోలీసుల కధనం మేరకు మృతురాలు సునీతకు అదే కాలనీకి చెందిన మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో భార్య, భర్తలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చి కేసులు లేకుండా ఇద్దరూ ఒద్దికగా జీవించాలని సూచించారు. అనంతరం ఇద్దరూ కోనంకిలోని బంధువుల ఇంట్లో నాలుగు రోజులు ఉండి శనివారం అడుసుమల్లికి వచ్చారని తెలిపారు. ఇంట్లో సరుకులు లేకపోవడంతో కిషోర్ తేవడానికి బజారుకు వెళ్లాడు. అతను తిరిగి ఇంటికి రాగా అక్రమ సంబంధానికి పాల్పడిన వ్యక్తి అప్పుడే ఇంట్లోనుండి పారిపోవడాన్ని గమనించాడని బంధువులు అంటున్నారు. దీంతో భార్య, భర్తల మద్య మళ్లీ వాగ్వివాదం జరిగిందంటున్నారు. ఈనేపధ్యంలో ఇద్దరూ శనివారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మృతుడు కిషోర్ పొలం కౌలుకు తీసుకుని రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరం మిర్చి సాగు చేశాడు. దీంతోపాటు డ్రైవర్‌గా పనిచేసేవాడని చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో పిల్లలు బోరున విలపించారు. ఇంకొల్లు సిఐ ఎం శేషగిరిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.