చీరాల : న్యూ కాలనీకి చెందిన దిలీప్ అనే యువకుడిని అతని భార్య రిబ్కా, ఆమె బంధువులు హత్య చేసినట్లు దిలీప్ తల్లి మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్పి జయ రామ సుబ్బారెడ్డి తెలిపారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తండ్రిని కోల్పోయిన దిలీప్ 2012 నుండి ఆటో నడుపుకుంటూ తన తల్లి మనెమ్మతో కలిసి న్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకునే క్రమంలో బోయినవారిపాలెంకు చెందిన రిబ్కా అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు, ఏళ్ళ కొడుకు ఉన్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న కారణంగా 15రోజుల క్రితం భార్య రిబ్కాను పుట్టింటికి పంపించాడు. 40ఇళ్ల కాలనీకి చెందిన లాయర్ సురేష్ వద్ద పెద్దలు పంచాయతీ నిర్వహించారు. ఇరువురు విడాకులు తీసుకునేందుకు అంగీకరించారు. అయితే ఆ తర్వాత విడాకులు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో రిబ్కాకు మరో వివాహం చేసుకునేందుకు దిలీప్ అడ్డు వస్తాడనే కారణంతో రిబ్కా తల్లిదండ్రులు దిలీప్ ను హత్య చేసేందుకు పథకం వేసుకున్నట్లు తమ విచారణలో తెలిసిందని డిఎస్పీ వివరించారు. జూన్ 1న దిలీప్ మామ చేత నమ్మకంగా న్యూ కాలనీకి పిలిపించి మద్యం తాపీ హత్య చేసినట్లు ముద్దాయిలు మధ్యవర్తుల సమక్షంలో పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలిపారు. హత్య కేసులో ముద్దాయిలైన పెరిగా వెంకటేశ్వర్లు, పెరిగా శ్రీను, పెరిగా చంగయ్య, పెరిగా రవితేజ, పెరిగా రోజా, మోటా రిబ్కాతో పాటు ఒక మైనర్ బాలుడిని ఈపురుపాలెం శేఖర్ పుట్ట వద్ద అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కరోనా పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.