Home ప్రకాశం పోలీస్ కస్టడీలో ఎస్సీ, ఎస్టీలే ఎందుకు బాధ్యులవుతున్నారు : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి.

పోలీస్ కస్టడీలో ఎస్సీ, ఎస్టీలే ఎందుకు బాధ్యులవుతున్నారు : కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి.

367
0

ప్రకాశం : పోలీస్ కస్టడీలో ఎస్సీ, ఎస్టీలే ఎందుకు బాధ్యులవుతున్నారని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సింగరాయకొండ మండలం కనమళ్ల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పేరం వెంకటరావు(23) అనే యువకుడి మృతదేహానికి ఎమ్మెల్యే స్వామి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులను సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ కనుమళ్ల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు తెలంగాణలోని మిర్యాలగూడ దగ్గర పోలీసు కస్టడీలో ఉండగా కారు దిగి లారీ ప్రమాదంలో మృతి చెందడం బాధాకర సంఘటన అన్నారు. ఆ కుటుంబం ఎదిగొచ్చిన బిడ్డని నష్టపోయిందని, వికలాంగురాలైన చెల్లెలు, పది చదివే తమ్ముడు ఉన్నారని అన్నారు. ఈ వయసులో కుటుంబానికి ఎదిగొచ్చిన బిడ్డ పోవడం బాధాకర విషయం అన్నారు. కందుకూరు పోలీసులు ఒకరికి ముగ్గుర్ని ఎస్కార్ట్ గా ఎంతో జాగ్రత్తగా పంపాల్సిన పోలీసులు, ఏఎస్సై ఒక్కరే వెళ్లడం, ఏఎస్సై విధినిర్వహణలో నిర్లక్ష్యమే మృతుడి చావుకు కారణమన్నారు. కోర్టులో హాజరుపరిచే వరకు పోలీసులదే బాధ్యత అన్నారు. ఈ సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పి ఏఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ఒకవేళ యువకుడు తప్పు చేస్తే కోర్టులో శిక్ష పడవచ్చు, మనిషి బ్రతికే ఉంటాడని, ఇక్కడ మనిషిని నష్టపోయిన దృష్ట్యా కులసంఘాలు కోరుతున్నట్లు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కందుకూరులో నమోదు చేసిన ఈ కేసులో అనుమానాలున్నాయంటున్నందున కేసు పునసమీక్షించాలని జిల్లా ఎస్పీని ఈ సందర్భంగా కోరారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడితే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఇస్తామని చెబుతున్నారని, అసలు ఈ ప్రభుత్వానికి వీటిపై ఒక పాలసీ లేదన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 30ఏళ్ల లోపు వారికి మూడున్నర లక్షలు నష్టపరిహారం ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మొత్తం కుటుంబానికి సరిపోదని ఇదే సంఘటన చీరాలలో జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పది లక్షల చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి నిరుపేద గిరిజన కుటుంబానికి అందివచ్చిన కొడుకు పోలీస్ కస్టడీలో మృతి చెందాడు కాబట్టి తక్షణ సాయంగా పది లక్షలు వెంటనే అందించాలని కోరారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరుకల హక్కులసంఘం డిమాండ్ ప్రకారం 25లక్షలు ఇస్తే కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై ఇదే తరహాలో నెల రోజుల్లో జిల్లాలో మూడు సంఘటనలు జరిగాయని అన్నారు. ఆ ఘటనల్లో పోలీసుల వల్లనే చనిపోయారని అన్నారు. పేరం వెంకట్రావు మూడవ వ్యక్తని అన్నారు. చీరాలలో కిరణ్, నిన్న ఉలపాడులో దాసరి మాల్యాద్రి నేడు వెంకట్రావు అని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలో ఎస్సీ, ఎస్టీలే ఎందుకు బాధ్యులవుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.