చీరాల : పట్టణ నడిబొడ్డున ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తిరువీధుల కృష్ణమూర్తి భవనాన్ని కొందరు ఒక సామాజిక వర్గం పేరుతో ఆక్రమించుకుని యదేచ్చగా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు డాక్టర్ పాలేటి రామారావు ఆరోపించారు. గురువారం తన హాస్పిటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొలిమేర రోడ్డులోని ఒక భవనంలో పట్టపగలే పేకాట, వ్యభిచారం, మద్యపానం, అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న బాపట్ల జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లలేదా లేక తెలియనట్లుగానే నటిస్తున్నారా అని ప్రశ్నించారు. లేకుంటే రెవెన్యూ, పోలీస్ అధికారులు వారికి అనధికారికంగా అనుమతులు ఇచ్చారాని అన్నారు.
బ్రతుకు తెరువు కోసం ఎక్కడో మారుమూల ప్రాంతంలో నాటుసారా కాసే వాళ్ళను మాటు వేసి పట్టుకునే పోలీసులకు పట్టణం నడిబొడ్డున జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యదేచ్చగా కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు మంచి పేరు తేవాలని నిబద్ధతతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ పని చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి అధికారులు పట్టణ నడిబొడ్డున ఓ భవనములో ఇలాంటి అసాంగిక కార్యక్రమాలు జరుగుతుంటే ఇక్కడే నివాసం ఉండే జిల్లా కలెక్టర్ కానీ, ప్రతినిత్యము లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించే ఎస్పీ దృష్టికి వెళ్లకపోవడం విచారించదగ్గ విషయం అన్నారు. ఆ భవనానికి సమీపంలో ఆర్డీవో, తాసిల్దార్ కార్యాలయలు, ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉందని అన్నారు.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ తిరువీధుల కృష్ణమూర్తికి చెందిన భవనాన్ని ఆక్రమించుకుని అద్దె చెల్లించకుండా వాడుకుంటున్నారని ఆరోపించారు. 80 సంవత్సరాలు పైగా వయస్సు ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి భవనం ఖాళీ చేయమంటే పట్టించుకోకుండా గత 18 సంవత్సరాలుగా అందులో ఉంటున్నారని అన్నారు. భవన యజమాని డాక్టర్ కృష్ణమూర్తి తన భవనాన్ని ఖాళీ చేయాలని అడుగుతున్నా ఆక్రమణ దారులు ఖాళీ చేయడం లేదని వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. బాధితునికి న్యాయం చేయాల్సిన పోలీసులు న్యాయం చేయకపోగా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. చీరాల డిఎస్పి భవనo యజమానిని బెదిరించి అద్దెదారుల (ఆక్రమణ)తో రాజీ చేసుకోమని చెప్పటం ఎంత వరకు సమంజసమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోరే డాక్టర్ కి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఏమి న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు మాటలలో కాకుండా చేతలలో తమ పనితనం చూపాలని కోరారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే జనమే సమస్యను పరిష్కరించుకుంటారని చెప్పారు.