– తీవ్ర అసంతృప్తిలో ఒంగోలు నగర ప్రజలు?
– రంగులేయటం బొమ్మలు పెట్టడమే అభివృద్ధి
– బ్రమల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు
ఒంగోలు (Ongole) : నగరంలో డివైడర్లు, బ్రిడ్జి పిల్లర్లకు రంగులు వేయడం కోసం రూ.2కోట్లు ఇచ్చిన నగరపాలక సంస్థ డివిజన్లలో ప్రజా సౌకర్యాల కల్పకు అవసరమైన పనులకు ఒక్క రూపాయి ఇవ్వటంలేదనే ఆరోపణలు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ ఆస్మదీయులు, తస్మదీయులకు దోచిపెడుతున్నారనే అపవాదు తెచ్చిపెట్టుకున్నారు. లోకల్‌లో పనిచేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రంగులేసిన తన వాళ్లకు వద్దంటే డబ్బు చెల్లిస్తున్నారు. వడ్డించేవాడు, ఆపైవాడు మన వాడైతే ఇబ్బందే లేదు అన్నట్లు నగరపాలక సంస్థలో పనితీరు విమర్శలు ఎదుర్కొంటుంది.
జనరల్ ఫండ్‌లో పనిచేసిన వాళ్లకు ఈపాటికే రూ.5కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. వాటికి దిక్కులేదు. జనరల్ ఫండ్‌లో పనిచేసేవాడు కరువయ్యాడు. మీటింగులపైన మీటింగులు పెడుతున్నారే పత్ప పనుల కలెక్షన్ మాత్రం శూన్యం. కొన్ని వందిమాగద పత్రికలు అధికార పార్టీని పొగడటం తప్ప ప్రజా సమస్యలు రాయరు.
ప్రస్తుతం దోమల బస్తీగా ఒంగోలు
నగరంలో ఎక్కడ నిల్చున్నా… చీకటి పడితే దోమల మోతతో నగర ప్రజలు అల్లాడి పోతున్నారు. దోమల నిర్మూలనపై అవగాన లేకనో, లేక ఆ పేరుతో జేబులు నింపుకోవడానికో తెలియదు కానీ డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ చేస్తున్నారట. ఇది వింటేనే నవ్వొస్తుంది. దోమ బతికేది ఎన్నాళ్లు, లార్వాగా వుండగానే ఎలా చంపాలి. తక్కువ ఖర్చుతో ఏమి చేయవచ్చనేది కాకుండా పేపర్ పులుల్లాగా ఆర్భాటం, నిధులు ఖర్చ చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైన్లలో సిల్ట్ తియ్యటం అంతంత మాత్రమే. శానిటేషన్ అద్వానంగా మారింది. జిటిఎస్ పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘సి’ బిల్లుల పేరుతో నగర పాలక సంస్థను దోచేస్తున్నారు. ట్యాంకర్ ఓనర్లు సమ్మె చెస్తున్నారు. ట్యాంకర్లు రావు. పట్టించుకునే దిక్కులేదు. ప్రస్తుతం రోడ్ల విస్తరణ పేరుతో 4 రోజులు ప్రజలకు నీళ్లు రావు. నగర ప్రజల కష్టాలు హతవిధీ.
బొమ్మలు పెట్టడం, రంగులు వేయడం, డబ్బుల్ని నీళ్లలా ఖర్చుపెట్టడం. ఇప్పుడు నగర పాలక సంస్థలో అలవాటైపోయింది. పోనీ ఆ బొమ్మలేమైనా ఒంగోలు చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తాయా అంటే అదీ లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎక్కడివో కాపీ కొట్టారని చర్చిస్తున్నారు.
రెండు కాదు మూడు బుట్టలతో చెత్త సేకరణ శూన్యం. ప్లాస్టిక్ విచ్చలవిడి పెరిగింది. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధమని ఊకదంపుడు మీటింగులు పెట్టారు. ఏ అక్టోబర్ 3 అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవ్వన్నీ గోడమీద ‘రేపు’ లాగ తయారైంది. పట్టణాన్ని అందంగా రూపొందిస్తున్నారంటే బొమ్మలు పెట్టడం, రంగులెయ్యటం. కర్నూలు ఫ్లైఓవర్ కింద గార్డెన్‌కు నీళ్లు పోసే దిక్కు లేదు. ఫ్లెక్సిల మాయం. కొత్తగా చూపించాలని, పేరు రావాలని, డబ్బులు మింగేయాలనే తపన తప్ప మరొకటి లేదని చర్చ.
ఇక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి తీరును చూసి అవినీతే సిగ్గు పడే పరిస్థితి. మూసివేసిన మున్సిపల్ స్కూల్ స్థలంలో బ్రహ్మాండంగా స్లాబ్ వేస్తే ఎసిపి నువ్వేం చేస్తున్నావ్ తో సరి. రూ.కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేస్తుంటే విజిలెన్స్, ఎసిబిలు, జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తుంది. ఇంకా ఉంది . రేపు మాట్లాడుకుందాం.
బయట నుంచి చూసేవాళ్ళు ఆహా ఓహో అనుకుంటూ ఉంటే, నాయకులు, అదికారులు తమ భుజాల్ని తట్టుకుంటున్నారు. ఊళ్ళో జనం మాత్రం నీళ్లు రాక, దోమలతో బేజారౌతున్నారు. కొత్త రోడ్లు, డ్రెయిన్లు వేసేవాడు లేక లబో దిబో అంటున్నారు.






