చీరాల (Chirala) : సంక్షేమ పాలన టిడిపితోనే సాధ్యమని శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. మండలంలోని తోటవారిపాలెం పంచాయతీలో ఆదివారం టిడిపి జెండా ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలు గుర్తించి పని చెయ్యాల్సిన బాధ్యత నాయకులపై వుందని అన్నారు. పద్ధతి ప్రకారం సిస్టంలో ప్రజలను నడుపుతున్నానని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రభాగంలో నిలపడమే తన లక్ష్యమని అన్నారు. నేడు జరిపిన సైకిల్ పోటీల్లో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారని, తద్వారా జాతీయ స్థాయిలో చీరాల పేరు వినబడిందని అన్నారు. గ్రామంలోని సమస్యలు గుర్తించాలని, వాటి పరిష్కారానికి నాయకులు కృషి చెయ్యాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జీవించాలని కోరుతున్నానని అన్నారు.
మంచి పాలన అందించాలంటే మంచి అధికారులు వుండాలని అన్నారు. ఆ విధంగా అధికారులను నియమించామని అన్నారు. మన ప్రజా ప్రభుత్వం ఈపాటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం అమలు చేయగా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, ఇళ్ళు లేని పేదలకు ఉచితంగా ఇళ్ళు, కనీస ప్రజా అవసరాలు తీర్చే విధంగా పని చేస్తున్నామని అన్నారు. అధికారం వున్నప్పుడే నాయకులు జాగ్రత్తగా ఉండాలని, ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాలని అన్నారు. జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని అన్నారు. పిల్లల్ని బాగా చదివించాలని అన్నారు. నేటి విద్యార్దులు రాష్ట్ర, దేశ భవిష్యత్తు అన్నారు. నిరుద్యోగం తొలగించడమే లక్ష్యంగా ఎంఎస్‌ఎంఇ పార్కు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. గతంలో చంద్రబాబు హైదారాబాద్‌లో మహిళ పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు నిర్మించారని, అదే తరహాలో చీరాలలో కూడా చేస్తామని అన్నారు. సభలో ఎఎంసి ఛైర్మన్ కౌతరపు జనార్ధనరావు, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.